ఆంధ్రజ్యోతి నుండి…

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్ల కూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు.. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావురాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది.

పుస్తకం పట్టిన చేతులకు కృతజ్ఞతలు

పుస్తకాన్ని పట్టి ఇచ్చిన, పుస్తకాల పట్టీ ఇచ్చిన చేతులకు ధన్యవాదాలు

బుక్కులకు బుక్కైపోయిన మహనీయులు వర్ధిల్లాలి

పుస్తకాలకు లొంగిపోయిన మానవీయులకు జిందాబాద్‌

అనేక, అసంఖ్యాక గ్రంథాలముందు విధేయులై, వినమ్రులూ ఐ

నిలబడిన ఆ బాలగోపాలానికి హేట్సాఫ్‌

‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అనే పాటను కొద్దిగా మార్చి పాడుకోవాలనిపిస్తోంది.. “పిల్లలూ, దేవుడూ, పుస్తకప్రియులూ చల్లనివారే కల్లకపట మెరుగనీ కరుణామయులే” అని ఆలాపించాలనిపిస్తోంది.. 23వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నెక్లెస్‌ రోడ్‌కి అతి విలువైన గ్రంథ హారాన్ని ఓ పదిరోజులపాటు అద్దెకిచ్చింది. పది రోజులూ నెక్లెస్‌ రోడ్‌ మెడలో వేళ్లాడే పుస్తక హారం బరువుకి తల ఎటూ తిప్పలేక పుస్తకంలోకే తొంగిచూసింది.

ఇది నిజంగా పుస్తక తులాభారం. పుస్తకాలు సత్యభామ, రుక్మిణులై, రుక్మిణులై, పదారు వేలమంది గోపికలై వివిధ రూపాల పాఠక శ్రీకృష్ణ హృదయాన్ని అధివసించడానికి ప్రయత్నం చేసాయని అనటానికి నోరు రావటం లేదు. మనిషి పరమాత్ముడు, పుస్తకం ఆత్మ అయితే- ఈ ఆత్మలు పరమాత్మలో తనం కావడానికి, పరమాత్మను చేరుకోవడానికి తహతహలాడాయి అని అనాలి. తమ పరమాత్మను తామే వెతుక్కుని పుస్తకాత్మలు సేదదీరాయి. తమ వియోగానికిక తెర పడిందని, తమ ప్రియులకు తృప్తిని, తమకు మోక్షాన్ని సిద్ధింపజేస్తామని ప్రకటిస్తూ వెళ్లిపోయాయి.

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్లకూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు. ఎన్నో పుస్తకాలను పాఠక దేవుళ్లు కొన్నారని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. ప్రజలు కార్లు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని ఈ బుక్‌ ఫెయిర్‌ ఖరాఖండిగా చెప్పింది. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావు రాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది. పిల్లలు రంగురంగుల బొమ్మల పుస్తకాల వైపు, కథల వైపు, సి.డి.లవైపు లేత పూలలాగా ప్రవహించారు.

యువకులు వ్యక్తిత్వ నిర్మాణాలవైపు, ఉపాధి అవకాశాలను తెలిపే సమాచారమిచ్చే పుస్తకాలవైపు నడిచారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి లలితా సహస్రనామాల దగ్గర ఆగారు. అక్కడక్కడా గురువుల దగ్గర, గురు చరిత్రల దగ్గర నిలిచిపోయారు. పరిశోధకులు తమ తమ పరిశోధన అంశాలకు సంబంధించిన విషయ సేకరణ చేసుకున్నారు. పెద్దలు ఆధ్యాత్మిక, భక్తి గ్రంథాలను దేవులాడుకున్నారు. వృద్ధులు జీవితానుభవసారాన్ని వ్యాఖ్యానించే పుస్తకాలవైపు మొగ్గుచూపారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ డబ్బుల్ని తడిమి చూసుకుని, చూపు ఆనిన మేరకు ఒకటీ అరా పుస్తకాలను కొనుగోలు చేశారు. అధ్యాపకవర్గం ధరల విషయంలో చిరాకుపడింది. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొన్నారు. అసిస్టెంట్‌- అసోసియేట్‌ ప్రొఫెసర్లు డిస్కౌంట్‌ ఎక్కువ ఇవ్వమని అడిగిచూశారు. కొనదలచిన పుస్తకాల్లో ఒకటీ అరా తగ్గించుకున్నారు.

ఐ.టి.ప్రొఫెషనల్స్‌ ఈసారి కొద్దిగా సంస్కృతి, సామాజిక పరిణామం, జీవిత చరిత్రలవైపు తొంగి చూసినట్లున్నారు. సాహిత్యాభిమానం గల పాత్రికేయులు ఆయా కవుల, రచయితల పుస్తకాలు కొనుగోలు చేశారు. అనువాదం, అనువాద సిద్ధాంతాలపై గ్రంథాలు స్వల్పంగా అమ్ముడయ్యాయి. భాష, సంస్కృతి, గిరిజనులపై మోనోగ్రాఫ్‌ల్లాంటివి కూడా కొన్ని అమ్ముడయ్యాయి. అరవింద అడిగ వైట్‌ టైగర్‌ పుస్తకం గురించి వాకబు ఎక్కువ జరిగింది. ఒబామా ప్రత్యేక ఆకర్షణ. హ్యారీ పోటర్‌ పిల్లల సంబరం. రజనీష్‌పై ఆసక్తి అదేవిధంగా కొనసాగుతోంది.

జిడ్డు కృష్ణమూర్తిపై కుతూహలం, సంశయం, పాఠకుల్లో.. ఇస్కాన్‌ ఎక్కడ? కొత్త పాఠకులు ఏర్పడుతూ ఉన్నారనడానికి సూచన. నాట్యం, చిత్రకళ, శిల్పం, సంగీతం పరిమిత సంఖ్యలో అమ్మకాలు. ఎడ్యుకేషన్‌పై గ్రంధాలు, సామాజిక శాస్త్ర గ్రంధాలు హాట్‌ కేకులు కాకపోయినా ఒక మాదిరిగా కదిలాయి. పెద్దబాలశిక్ష సూపర్‌ డూపర్‌ హిట్‌. వ్యసన సంస్కృతిని వదిలిపెట్టి అభ్యసన సంస్కృతివైపు వెళ్తున్నాం అనడానికిది నమ్మదగిన సూచన కాకపోవచ్చు. నేర్చుకోవటంలోని వెలితికి, నేర్చుకున్నది మరచిపోతున్న తక్షణ సంస్కృతికి కూడా గురుతు కావచ్చు. ఆర్‌.కె గారన్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ తన కాస్మాపాలిటన్‌ కల్చర్‌ని విశిష్టంగానే పట్టిచూపింది. మంచి పుస్తకాన్ని ఎంచి మరీ కొంటున్నారు. పాఠకులున్నారు

జాగ్రత్త. పబ్లిషర్స్‌ ఎంచి మరీ మంచి పుస్తకాలే వేయాలేమో! పదిరోజుల పుస్తక ప్రదర్శన పది కాలాలపాటు పాఠకులకు ఎటువంటి పుస్తకాలు, ఏ యే ధరల్లో వేయాలో విడమరచి చెప్పింది. ద్రావిడ విశ్వవిద్యాలయానికి స్టాల్‌ నెం 13కు చేకూరిన లాభమిదే. ఈ ఎగ్జిబిషన్‌లు ఆంధ్రదేశంలోని కవులు, రచయితలు చాలామంది కలిశారు. మా ద్రావిడ విశ్వవిద్యాలయం స్టాల్‌ను దర్శించారు. కొన్ని పుస్తకాలు కూడా కొన్నారు. నేను మాత్రం వచ్చే సందర్శకులలో స్మైల్‌ను, జ్వాలాముఖిని వెతుక్కుంటున్నాను. ఈ ఇద్దరే కనిపించడం లేదు…!

- సీతారాం

ఆంధ్రజ్యోతి నుండి…

ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అన్ని రకా లుగా బాగుంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరిని ఆకర్షించగలుగుతోంది? కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన కవర్‌ పేజీతో చాలామంది దృష్టికి వెళ్లకుండానే మిగిలిపోవడం లేదూ..

కొన్ని పుస్తకాల్ని చూడగానే చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది. ముఖపత్రం పైన కాసేపు దృష్టి నిలిచిపోతుంది. పుస్తకంలోని ఆత్మ ముఖపత్రం ద్వారా మనలోకి ప్రసరిస్తుంది.. ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అలా ఉంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరు చదువగలుగుతున్నారు? అన్ని రకాలుగా అందంగా అమిరే ముఖపత్రాలు (కవర్‌లు) ఎన్ని? ఈ దృష్టితో పరిశీలిస్తే అత్యధికశాతం కవర్‌లు ఏదో ఒక లోపంతో కనిపిస్తుంటాయి.

కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన డిజైన్‌తో పాలిపోయినట్లు కనిపిస్తాయి. పుస్తకంలోని కంటెంట్‌ బాగున్నా కవర్‌ పేజీ బాగుండక చాలామంది దృష్టికి వెళ్లని పుస్తకాలెన్నో.. ముఖ్యంగా బొమ్మ, పుస్తకం పేరు, రచయిత పేర్లతోపాటు బ్యాక్‌ కవర్‌ మ్యాటర్‌, మంచి పేపర్‌, చక్కటి రంగులు.. వీటన్నింటితో కూడిన కవర్‌ పేజీ పాఠకుడి దృష్టిని ఆకర్షించే అవకాశం వుంది. ఈ విషయమై డిజైనింగ్‌ కూడా చేస్తున్న కొందరు ఆర్టిస్టులను కదిపితే- మనదేశంలో అన్ని భాషల ముఖపత్రాల ‘డిజైన్‌’ కన్నా తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ చాలా బాగుంటోందని అంటున్నారు.

గతంలో ఆర్టిస్టే కవర్‌పేజి డిజైనర్‌. ఉదాహరణకు బాపు, శీలా వీర్రాజు, చంద్ర, బాలి, గోపి, ఉత్తమ్‌, మోహన్‌ టి.వి.ప్రసాద్‌, లక్ష్మణ్‌ ఏలే, రమణ జీవి, అక్బర్‌ వంటి చిత్రకారులు. క్రమంగా డిజైనర్‌ అనే ఒక పని కూడా ఎవాల్వ్‌ అయింది. ఇది బహుశా అడ్వర్జయిజింగ్‌ ఏజెన్సీస్‌ లేక విదేశాల ప్రేరణ కావొచ్చు. దానికి కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తోడయి ఒక వృత్తి స్థాయిలో స్థిరపడింది. ఇందులో కేవలం ఒక ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మలతోనే కాకుండా అనేక పద్ధతులతో కవర్‌పేజీలు చేసే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అసలు ఆ ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మని ఆ ఆర్టిస్టే నమ్మలేనంత అద్భుతంగా ఎక్స్‌ప్లాయిట్‌ చేయగలిగే కంప్యూటర్‌ పరిజ్ఞానం డెవలప్‌ అయింది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న కవర్‌పేజీలు ఎం తో విలక్షణంగా, ఎంతో విభిన్నంగా వుంటున్నాయి.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కట్‌ కలర్‌ దాటి, మల్టీ కలర్‌ (4) ఇంకా ముందుకెళ్లి స్పెషల్‌ కలర్స్‌ (5,6,7) టెక్చర్‌ కలర్స్‌ దాకా.. మాప్‌లితో పేపర్‌ నుంచి 300 జిఎస్‌ఎమ్‌ ఫారిన్‌ మ్యాట్‌కార్డ్‌ దాకా.. లామినేషన్‌, మ్యాట్‌ లామినేషన్‌, స్పాట్‌ లామినేషన్‌ (యు.వి.) టెక్చర్‌ స్పాట్‌ లామినేషన్‌.. సైడ్‌ పిన్నింగ్‌ నుండి స్పైరల్‌ దాటి పర్‌ఫెక్ట్‌ బైండింగ్‌ క్రీజింగ్‌ దాకా.. ఇంక బొమ్మల విషయానికొస్తే.. ఇంక్‌ డ్రాయింగ్‌ నుండి వాటర్‌ కలర్‌, పోస్టర్‌ కలర్‌, చార్‌కోల్‌, పేస్టల్‌, పెన్సిల్‌ దాటి ఆక్రిలిక్‌ కలర్స్‌, ఆయిల్‌ కలర్స్‌ పెయింటింగ్స్‌ అట్ట మీద బొమ్మలుగా వస్తున్నాయి. ఇంకాస్త ముందుకెళ్లి డిజిటల్‌ డ్రాయింగ్స్‌ వస్తున్నాయి.. తొలిరోజుల్లో పుస్తకం పేరూ, రచయిత పేరు మాత్రమే కవర్‌ టైటిల్‌గా వుంటూ వచ్చింది. ఆర్టిస్టు వేసిన బొమ్మను అతను సూచించిన రీతినే బాక్సులోనో ఓపెన్‌గానో అట్టమీద పెట్టేసి అచ్చేసేవారు. తర్వాత్తర్వాత ఒకటీ రెండు రంగులు, లేదా మూడు రంగుల్లో కట్‌ కలర్స్‌ పద్ధతిలో బ్లాకులు చేసి అచ్చువేసేవారు. ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ రావడంతో మల్టీకలర్‌ ముఖచిత్రాలు విరివిగా వాడకంలోకి వచ్చాయి.

ఇవాళ సాహితీవేత్తలంతా మల్టీకలర్‌లో టైటిల్‌ వేసుకోడానికి యిష్టపడుతున్నారు. ఆర్టిస్టుతో బొమ్మ వేయించుకొని తమకిష్టమైన రీతిలో డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇక్కడ కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ చేసే డిజైన్‌తోనే సరిపుచ్చుకుంటే మరికొందరు ప్రత్యేకంగా డిజైనర్లని ఆశ్రయిస్తున్నారు. బొమ్మ గీయడంతోపాటు డిజైన్‌ కూడా చేసిచ్చేవాళ్లు తక్కువ. ముఖ్యంగా డిజైనర్‌ స్వేచ్ఛకు వదిలిపెట్టకుండా రచయితలు పక్కన కూర్చుని విసిగించి తమ తెలియనితనాన్ని బైటేసుకుని పుస్తకాన్ని పాడు చేసే సందర్భాలు ఎక్కువ. ముందు డిజైనర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి చూస్తే బాగుంటుందని ఆర్టిస్టులు అంటున్నారు. అయితే ఇక్కడ బొమ్మ గీసే ఆర్టిస్టుల్లోనూ వారి భావజాలాలు, వారు ఎరిగిన జీవితాలు వారి ‘లైన్‌’ని, ఆర్ట్‌ని ప్రభావితం చేస్తాయనేది అందరి గ్రహింపుకు వచ్చిన విషయమే.

కొందరి గీత ఒక వర్గపు జీవన రేఖను దాటి రాలేదని, మరొకరి గీత అట్టడుగు వర్గాల జీవితాల్ని మాత్రమే పట్టి ఇస్తుందనే విమర్శలున్నాయి. విభిన్న అస్తిత్వ వాదాల నేపథ్యంలో కొందరి బొమ్మలు అవుట్‌డేటెడ్‌గా కనిపించవచ్చు, మరికొందరివి కొన్ని వర్గాలకే పరిమితమైనట్లు అనిపించవచ్చు.. అర్థం చేసుకోవాల్సిందల్లా రచయిత తన భావాలకు తగ్గ ఆర్టిస్టును డిజైనర్‌ను ఎంచుకున్నాడా లేదా అన్నదే. మొత్తంగా ముఖపత్రం పుస్తకం మీద తప్పక ప్రభావం చూపుతుందనేదే ఆర్టిస్టుల అభిప్రాయం. తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ సైంటిఫిక్‌గా మరింత మెరుగుపడాల్సిన అవసరం వుందని వారు చెబుతున్నారు.. చివరగా, సాహితీ విమర్శకులు కవర్‌ పేజీ మీద కూడా స్పందిస్తుంటే బావుంటుందని అనిపిస్తున్నది..

- స్కైబాబ

అర్ధవంతంగానూ ఉండాలి

మార్కెట్లో విడుదల చేసే ఏ వస్తువునైనా ఆకర్షణీయంగా చూపే వ్యాపార సంస్కృతి ఛాయలు యిప్పుడు గ్రంథ ప్రచురణలోకీ చొరబడ్డాయి. పుస్తకం టైటిల్‌ అందంగా వుంటూనే అర్ధవంతంగా కూడా వుండాలి. ఇటీవల కొందరు సాహితీవేత్తలు- ముఖ్యంగా కవులు పోస్ట్‌ మోడ్రన్‌ ట్రెండ్‌లను విమర్శిస్తూనే తమ పుస్తకాల కవర్‌ పేజీల మీది చిత్రకళలో మాత్రం అదే ట్రెండ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ని అచ్చువేసుకుంటున్నారు. దీనిలో అందమూ ఆకర్షణలకన్నా ఇతరులకంటే భిన్నంగా వుండాలనే ధోరణి కనిపిస్తుంది.

‘విషయంతో సంబంధం వుంటే మంచిదే, లేకపోయినా పరవాలేదు, ముఖచిత్రం మాత్రం అద్భుతంగా అనిపించాలి’ అనే ధోరణి చాలామంది సాహితీవేత్తల్లో కనిపిస్తోంది. ముఖచిత్రంలో బేసిక్‌ కలర్స్‌- పసుపు, మెజంటా, నీలం, నలుపు- రంగులను నేరుగా వాడడంకన్నా మిక్స్‌డ్‌ కలర్స్‌లో అయితే గాడీగా వుండకుండా కళ్లకి ఆహ్లాదకరంగా వుం టుంది. ముదురు ఎరుపు పక్కన ముదురు నీలంగాని, ముదురు ఆకుపచ్చ రంగుగాని వాడితే కళ్లకి యిబ్బందిగా వుంటుంది. ముదురు రంగుల పక్కన లేత రంగులుంటే ఆ చిత్రం బాగా ఎలివేట్‌ అవుతుంది. లామినేషన్‌ చేయిస్తే బొమ్మ అందం మరికొంత పెరుగుతుంది. పుస్తకం పేరుగాని, రచయిత పేరుగాని బొమ్మని మింగేసేటట్టు పెద్దవిగా వుండకుండా చూసుకోవాలి.

అప్పుడు టైటిల్‌ అందంగా కనిపిస్తుంది. సింగిల్‌ కలర్‌లో వేసినా కొన్ని టైటిల్స్‌ అద్భుతంగా అనిపించినవి వున్నాయి. ఇది ఆర్టిస్టు వేసిన చిత్రంపై ఆధారపడి వుంటుంది. ఒకే రంగులో స్క్రీన్‌లు రకరకాలవి యిస్తూ ఎంతో ఎఫెక్టివ్‌గా బొమ్మని ఆఫ్‌సెట్‌ ప్రింటింగులో చూపించే సౌకర్యం వుంది. నా మట్టుకు నేను స్వేచ్ఛగానే డిజైన్‌ చెయ్యగలుగుతున్నాను. పూర్తి బాధ్యత ఆర్టిస్టు మీదే వేసినప్పుడు మరింత జాగ్రత్తగా చేయాల్సివస్తుంది. బాపు, మోహన్‌ లాంటి ఆర్టిస్టులు వేసే టైటిల్‌ కవర్స్‌ పుస్తకం తెరవాలనిపించేటట్టు చేస్తాయి. చాలామంది రచయితలు కవులు ఫలానావారే తమ పుస్తకాలకు ముఖచిత్రాలు వేయాలని కోరుకోవడం, వాటికోసం నెలల తరబడి ఎదురుచూడ్డం అందుకే.
- శీలా వీర్రాజు

ఆత్మ ప్రతిఫలించాలి

ఇవాళ పెయింటింగ్‌లను తీసుకొని కవర్‌ డిజైన్‌ చేయడం జరుగుతున్నది. కవిత్వంలో ఉండే మార్మికత (అబ్‌స్ట్రాక్ట్‌నెస్‌) డిజైనింగ్‌లోకి కూడా వచ్చింది. సమకాలీన  చిత్రకళను ఉపయోగించుకోవడం గమనించొచ్చు. కంప్యూటర్‌ విరివిగా ఉపయోగంలోకి వచ్చాక గ్రాఫిక్స్‌, ఫోటోషాప్‌ ఉపయోగం పెరిగింది. దాంతో డిజైనింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఇవాళ గ్రాఫిక్‌ డిజైనింగ్‌నే చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నా దృష్టిలో అందం అనేదానికి నిర్వచనం వేరు. నేను డిస్టార్షన్‌ బొమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాను. కంటెంట్‌ను బట్టి దానికి సమాంతరంగా ఊహించి బొమ్మ వేస్తాను. ఆర్టిస్టుగా నా వ్యాఖ్యానం నేను చేస్తాను. రచనలోని భావమే కాకుండా అది చదివిన ఆర్టిస్టుగా తన ఇంటర్‌ప్రెటేషన్‌ ప్రత్యేకంగా ఉండాలనేది నా అభిప్రాయం.
నాకు సంతృప్తి కలిగినట్లుగానే చేస్తాను. వేరేవారి ఐడియాను తీసుకోను. నా సొంత ఐడియాను ఎవరైతే తీసుకుంటారో వారికే నేను డిజైన్‌ చేసిపెడుతుంటాను. రచయితతో మాట్లాడి, చదివి బొమ్మ వేస్తాను. రచన యొక్క ఆత్మ బొమ్మలో ప్రతిఫలించేలా ప్రయత్నిస్తాను. క్లిప్‌ ఆర్ట్‌ను తీసుకోను. గ్రాఫిక్‌ను గ్రాఫిక్‌ డామినేట్‌ చేయకుండా చూసుకుంటాను. ఒరిజినల్‌గా నేను డ్రా చేసినవే వాడుతాను. ఒక్కోసారి నా పెద్ద పెద్ద పెయింటింగ్స్‌నే ఆ పుస్తకానికి నప్పుతుందనుకున్నదాన్ని వాడతాను.

పాఠకుల్ని ఆకర్షించడం అనేది ఆర్టిస్టు చేసే డిజైన్‌ను బట్టి ఉంటుంది. మల్టీకలర్‌ అంటే అన్ని రంగులూ తప్పనిసరి వాడాలని అనుకుంటుంటారు. నేను కేవలం రెండు రంగులనే వాడి కూడా పెయింటింగ్‌ వేస్తాను. బ్లాక్‌ అండ్‌ బ్రౌన్‌, బ్లాక్‌ అండ్‌ రెడ్‌.. అలా! చాలామంది బ్లాక్‌ను కలర్‌ అనుకోరు. వైట్‌ను కూడా కలర్‌ అనుకోరు. సింగిల్‌ కలర్‌ను వాడి కూడా అద్భుతంగా మెప్పించవచ్చు. నా పెయింటింగ్స్‌ చాలా వరకు రెండు లేదా మూడు రంగులు మాత్రమే వాడినవి. వే ఆఫ్‌ ప్రెజెంటేషన్‌ అనేది చాలా ముఖ్యం. పోస్టర్‌ చూసి సినిమా చూసే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లే పుస్తకం కవర్‌ చూసి చదివించే అవకాశమూ ఉంది.

- ఏలె లక్ష్మణ్‌

 చతుర్భుజమే అల్టిమేట్‌ కాదు

కవర్‌ అందంగా కనిపించాలంటే నేను చిత్రానికి ఎక్కువ స్పేస్‌ కేటాయిస్తాను. అక్షరాలను వీలయినంత సింపుల్‌గా ప్రయోగిస్తాను. ప్రధానచిత్రంలోంచే డామినెంట్‌ కలర్‌ను పిక్‌ చేసి దాన్నే అధికంగా వాడి ఎక్కువ కాంట్రాస్ట్‌ లేకుండా చేసుకుంటాను. డిజైన్‌ చేసేటప్పుడు రచయిత/కవి దగ్గర లేకుండా చూసుకుంటాను. కవర్‌ డిజైనింగ్‌ ఒక ఆర్టిస్టంత విస్తీర్ణమయిన ఆవరణ కాకపోయినా సంతృప్తికి సంబంధించిన మూలాలొకటే అనిపిస్తుంది రెండిటికీ. నాకయితే రంగులతో ఆడుకుంటున్నట్టుంది హాయిగా. నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. చేస్తున్న ప్రతి క్షణం సంతృప్తి చెందుతాను.

ఏ ఒకరో ఇద్దరో తప్ప నన్ను ఇలాగే చెయ్యమని, ఇలాగే కావాలని బలవంతం చేసినవాళ్లు లేరు. చాలామంది ఇది మీ పని మీకు నచ్చితే మాకు నచ్చినట్లే అన్నవాళ్లే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేక సింగిల్‌ కలర్‌ కవర్లు పాఠకుల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. అందులో వుపయోగించే విజువల్‌ విలువని బట్టి. డిజైన్‌ చేసే పద్ధతిని బట్టి. నిజానికి పేరుకి మల్టీకలర్‌ ప్రింటింగ్‌ అయినా మోనోకలర్‌ వాల్యూస్‌తో చేసిన కవర్‌ పేజీలే చాలా హుందాగా వుంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి, రంగులు రంగుల కవర్‌ పేజీల స్లిట్‌ పర్సనాలిటీలకంటే. సింగిల్‌ కలర్‌లో అంత డెప్త్‌ రాదు.

మల్టీ కలర్‌లో వచ్చే సింగిల్‌ కలర్‌ వాల్యూస్‌ బావుంటాయి. ముఖ్యంగా ఇవాళ కవర్‌ డిజైన్‌ ఎటు తిరిగీ చతుర్భుజంలోకి ఒదిగిపోవడమో, విస్తరించడమో జరిగింది. దాన్ని అధిగమించి డిఫరెంట్‌గా డిజైన్‌ చేయాల్సిన అవసరముంది. పాత పద్ధతుల్ని ప్రయత్న పూర్వకంగా వదులుకోవాల్సిందే. అందు కు కొత్తదనాన్ని స్వీకరించే మెత్తదనపు (్ఛ్ఠఞౌన్ఛ్చీఛజీజూజ్టీడ) ఆవశ్యకత చాలా అవసరం. కవర్‌ పేజి ప్రభావం కొత్త పుస్తకాల మీద తప్పకుండా వుంటుంది. కవర్‌పేజి అందంతోపాటు వెనక పేజీ మీద రాసివుండే ఆ పుస్తక సారాంశమో, లేక ఎవరివైనా ప్రముఖుల అభిప్రాయా లో కూడా పుస్తకం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ ప్రభావమంతా పుస్తకాన్ని తెరిపించేంత వరకే. తెరిచాక అందులో పుస్తకం ఆత్మ తప్పనిసరి. లేకపోతే అంతా వృధానే.
- రమణ జీవి

కవర్‌ డిజెనింగ్‌ ఒక సైన్స్‌

డిజైనింగ్‌ ఒక సైన్స్‌. ఆ అనుభవంతో కవర్‌ డిజైన్‌ చేయడం కళ. ముఖపత్రం అనేది పుస్తకం కంటెంట్‌ స్వభావాన్ని రిఫ్లెక్ట్‌ చేయాలి. విజువల్‌ ఈస్తటిక్‌ లాంగ్వేజ్‌ మీద అవగాహన, కొద్దో గొప్పో కంపోజిషన్‌ కుదురైన టైపోగ్రఫీ (అక్షరాలు రాయడం) మీద పరిజ్ఞానం వుంటే మంచి కవర్‌ పేజీ తయారవుతుంది. వీటితోపాటు సాహిత్యం మీద అభిరుచి కలిగివుండి, మనసుతో చేయగలిగివుంటే మంచి కవర్‌ డిజైన్లే వస్తాయి. నిజానికి నేను మొదట్లో.. కవర్‌ డిజైన్లు చేసేటప్పుడు పుస్తకం చదివి బొమ్మ వేసి డిజైనర్‌ దగ్గర కూర్చొని డిజైన్‌ చేయించేవాణ్ణి. కానీ నేననుకున్న ఫీల్‌ అంతగా కుదిరినట్లనిపించేది కాదు.

అందుకే నేనే గ్రాఫిక్‌ డిజైనింగ్‌ నేర్చుకుని బొమ్మ వేసుకుని డిజైన్‌ చేయడం వల్ల సరిగ్గా కావాలనుకున్న ఎఫెక్ట్‌తో చేయగలుగుతున్నాను. ఆధునిక పరిజ్ఞానం (కంప్యూటర్‌) అందించిన సౌలభ్యాన్ని కూడా అవసరం మేరకు వాడుకునే అవకాశం నాకు దీనివల్ల లభించింది. అది ఆర్టిస్టులకు అవసరం అనే భావిస్తాను. దీనివల్ల విజువలైజేషన్‌ విస్త ృతి పెరుగుతుంది. కంటెంట్‌ చేసిన డిమాండ్‌ మేరకు దీనిని వాడడం వల్ల కవర్‌ పేజీకి పూర్తి న్యాయం చేసిన వాళ్లం అవుతాం. కవర్‌ డిజైనింగ్‌లో లెజెండ్స్‌ అయిన ఆల్విన్‌ లస్టిగ్‌, పాల్‌రాండ్‌తోపాటు సమకాలీన ఇలస్ట్రేటర్‌ జాఫ్‌ గ్రాండ్‌ఫీల్డ్‌ అంటే నాకిష్టం.

పీటర్‌మెండల్‌సన్‌ డిజైన్స్‌ బాగుంటాయి. నేనెప్పుడూ కవి/రచయిత తనెక్కడ ముగించాడో అక్కడి నుంచి ఎక్స్‌టెండ్‌ అయ్యేలా బొమ్మ గీస్తాను. తను చెప్పదల్చుకున్నది ఏది వదిలేసాడో దాన్ని బొమ్మ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇలస్ట్రేటర్‌ని. పెయింటర్‌ను. ఒక పెయింటింగ్‌ చేసినప్పటి అనుభూతి ఒక కవిత్వ పుస్తకానికో, కథల పుస్తకానికో బొమ్మ వేసినప్పుడు కలిగే అనుభూతి ఒకే విధంగా వుంటుంది. పుస్తకానికి పెట్టిన పేరు, కంటెంట్‌ను బట్టి నేను మీడియంను ఎన్నుకుంటాను. వాటర్‌ కలరా ? ఆక్రిలిక్‌ కలరా ? ఫిగరేటివ్‌ ఆబ్‌స్ట్రాక్ట్‌ వేయాలా ? చార్‌కోల్‌ డ్రాయింగ్‌ వేయాలా ? నిర్ణయించుకుంటాను

నేను చిత్రకారుడిగా ఎదిగే దశలోనే దళితవాద, స్త్రీవాద, ముస్లింవాద, తెలంగాణా, విప్లవోద్యమాలతో నడవడం వల్లే నా కవర్‌ బొమ్మలు గ్రామీణ జీవన మూలాల్నుంచి మాట్లాడతాయి. నేను ఒక సెట్‌ ఆఫ్‌ కలర్స్‌నే బొమ్మలో వాడతాను. కంటెంట్‌ డిమాండ్‌ను బట్టి కవర్‌ డిజైన్‌లో రంగులు వాడతాను. మోనో టోన్స్‌తో.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ తో చేసిన కవర్‌ పేజీలు బాగుంటాయి. డబుల్‌ కలర్స్‌ను కొందరు ఇష్టపడతారు. కవర్‌ మీదున్న రంగులు ఏ ఏజ్‌ గ్రూప్‌ వారికైనా అప్పీలింగ్‌లా వుండాలనేది నా అభిప్రాయం. ఆయా సమయాల్లో ఉద్యమాలు, కాల పరిస్థితులు కూడా కలర్స్‌ను డిమాండ్‌ చేస్తాయి. అదేవిధంగా అక్షరాలు, బొమ్మ చుట్టూ రిలీఫ్‌ బాగా వుండేట్లు చూసుకుంటాను.
- అక్బర్‌