You are currently browsing the monthly archive for జూన్ , 2007.

సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి గా ప్రచురణ కర్త గా తెలుగు నాట ఒక విలక్షణమైన పేరున్న రంగనాయకమ్మ గారు పాఠకులకు చవక ధరలకు మంచి పుస్తకాలు అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. కేవలం 30 రూపాయలకే దీన్ని అమ్మాలని నిర్ణయించడం ద్వారా ఆమె తెలుగు పుస్తక రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించారు.

“కూర్‌స్క్‌ యుద్ధరంగంలో రష్యన్ల కోసం హిట్లర్‌ అందజేయబోతున్నాడని క్రితం మే నెలలో కుజ్నెత్సోవ్‌తో కోఖ్‌ చెప్పిన ‘అద్భుత బహుమానం’ సంపూర్ణమైన విఫలతతో అంతమైంది. నాజీలు లక్షా ఇరవై వేల సైన్యాన్ని నష్టపోయి తిరోగమనం చిత్తగించారు. సెప్టెంబరు చివరి రోజుల నాటికి ఎర్రసైన్యం ద్మీవ్ర్‌ నదీ తీరానికి పురోగమించింది. ఆత్మ విశ్వాసంతోనూ, ఆత్మసంతృప్తితోనూ ఒకనాడు మిడిసిపడిన జర్మన్లు ఆనాడు తాము విజయోన్ముఖులమనే విశ్వాసానికి తిలోదకాలిచ్చేసుకున్నారు…..”

‘దిటవు గుండెలు’ పుస్తకంలోని కొన్ని వాక్యాలివి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సోవియెట్‌ గెరిల్లాల వీరగాథను తెలిపే పుస్తకమిది. రష్యన్‌ భాషలో ద్మీత్రియ్‌ మెద్వేదెవ్‌ రాసిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు నుంచి ఉప్పల లక్ష్మణరావు అనువదించారు. దీనిని ఇప్పుడు రంగనాయకమ్మ మరోసారి ముద్రించారు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ, నాజీజం మీద జరిపిన పోరాటంలోనూ సోవియెట్‌ రష్యాది ఘనమైన చరిత్ర. అయితే ఆ పోరాటం ఎందుకు జరిగినట్టు? అంత త్యాగం ఎందుకు జరిగినట్టు? మళ్ళీ స్వార్థపరులకు అప్పగించడానికా? అన్న ప్రశ్న వేసుకుంటూ దీనిని ముద్రించారు. అదే సమయంలో మళ్ళీ అలాంటి వ్యక్తులు, త్యాగం భవిష్యత్తులో సాధ్యమవుతుందన్న నమ్మకం కూడా ఆమెకు ఉంది. ‘దిటవు గుండెలు’ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం. ఇప్పటి భాష కాకపోవడం వల్ల చదవడం కొంచెం శ్రమే.

దిటవు గుండెలు, రష్యన్‌ మూలం: ద్మీత్రియ్‌ మెద్వేదెవ్‌,
అను: ఉప్పల లక్ష్మణరావు. ప్రతులకు: నవోదయ బుక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌,
కాచిగూడ, హైదరాబాద్‌. పేజీలు: 242, వెల: రూ. 30/-

సమీక్ష మూలం: ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం 10 జూన్ 2007 

తెలుగు పుస్తకానికి మంచి రోజులు వచ్చాయనే మాట ఈ మధ్య చాలా చోట్ల వినపడుతోంది. మరీ గొప్పగా కాకపోయినా తెలుగు పుస్తకాల పరిస్థితి ఇప్పుడు ఓ మాదిరిగా ఉందనే చెప్పుకోవచ్చు.  తెలుగు నాట వస్తున్న, వచ్చిన మంచి పుస్తకాలపై పత్రికల్లో ప్రచురితమవుతున్న సమీక్షలు, స్వీయ సమీక్షలు, పాఠకుల సమీక్షలు; ఇంకా తెలుగు పుస్తకాల గురించి పాఠకులకు అవసరమైన అన్ని విషయాలను ఒక చోట చేర్చాలనేదే మా ప్రయత్నం.

తెలుగు పుస్తకాన్ని ఇంకొంచెం వ్యాప్తి చేద్దామనే మా ప్రయత్నానికి మీ వంతు సహకారం అందిస్తారు గదూ? 

వీక్షణం