naatakam2.jpg‘మా భూమి’ వంటి తెలుగు నాటకంతో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి వెలువరించిన పుస్తకం ఇది.

1880లో కందుకూరి వీరేశలింగం స్వయంగా రాసి ప్రదర్శించిన ‘వ్యవహార ధర్మ బోధిని’తో మొదలైన మన నాటక ప్రస్థానం గురించి ఇందులో చాలా సమాచారమే ఉంది. 1943లో బొంబాయిలో ఏర్పడిన ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఇష్టా స్ఫూర్తితో మన రాష్ట్రం నాటక రంగంలో ప్రజానాట్యమండలి తీసుకువచ్చిన ప్రభంజనం విశేషాలు ఈ పుస్తకంలోని వ్యాసాల్లో ఉన్నాయి. 125 ఏళ్ల తెలుగు నాటకరంగ పరిణామాల్లో తొలితరం నుంచి ఈ తరం దాకా అన్నింటిని సాకల్యంగా అధ్యయనం చేసిన వారితో వ్యాసాలు రాయించారు. మొత్తం 22 వ్యాసాల్లో డాక్టర్‌ కందిమళ్ళ సాంబశివరావు రచించిన నాలుగు అధ్యయన పత్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో వేదికల పైకి ఎక్కని తొట్టతొలి రచనల వివరాలు కూడా తెలియచెప్పారు.

‘విప్లవ జ్వాలలు రగిల్చిన ప్రజానాట్యమండలి’ శీర్షికతో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రాసిన వ్యాసంలో ఇంతవరకూ ఎక్కడా గ్రంథస్థం కాని అపురూప సమాచారం ఉంది. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న నినాదాన్ని నిజం చేసి చూపించిన ‘మా భూమి’ సంగతులు ఈ వ్యాసంలో ఉన్నాయి. ప్రజానాట్యమండలికి ఘనకీర్తి తెచ్చిపెట్టిన ఆ నాటకం నెలకొల్పిన అసమాన రికార్డుల విశేషాలు ఉన్నాయి. దీనిలో పదివేల పై చిలుకు ప్రదర్శనల్ని ఇరవై లక్షల పై చిలుకు ప్రేక్షకులు ఉత్తేజంతో పదేపదే చూసిన నాటకం ‘మా భూమి’. ప్రజానాట్యమండలికి చెందిన 125 శాఖలు 365 రోజుల్లో 1000 పైగా ప్రదర్శనలివ్వడం ప్రపంచ రికార్డు కదా. ప్రభుత్వం నిషేధించినా ఆ కారణంగా ఎలాంటి ప్రచారం చేసే అవకాశం లేకపోయినా టికెట్లు కొని మరీ ఆ నాటకం చూసిన సందర్భాలు దాని సత్తాని చాటాయి.

‘మా భూమి’లో తొలిరోజుల్నుంచి వేషం కడుతూ వచ్చిన వల్లం నరసింహారావు 1995-96 ప్రాంతాల్లో మళ్లీ ప్రజానాట్యమండలి కళాకారుల్ని కూడగట్టి పలు ప్రాంతాల్లో ఆ నాటకం ప్రదర్శించి ఆదరణ పొందిన విశేషాల్ని ఎందుకనో ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు. ఇంగ్లీషు చదువులతో ప్రభావితులైన తొలితరం నాటక రచయితలందరూ కూడా మొదట్లో పౌరాణిక ఇతివృత్తాలనే ఎంచుకోవడానికి గల కారణాలను చర్చిస్తే బాగుండేది. మన నాటకరంగం వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 40 లక్షల వ్యయంతో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవం లోని మంచి చెడ్డల ను కూడా ప్రస్తావిస్తే సముచితంగా ఉండేది. తెలుగు నాటకంతో సంబంధం ఉన్న వారంతా తప్పకుండా చదివి తెలుసుకోవల్సిన సమాచారం దీనిలో ఉంది.

- జి.ఎల్‌.ఎన్‌.మూర్తి

125 ఏళ్ళ తెలుగు నాటక రంగం (వ్యాస సంకలనం)

ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్‌,

పేజీలు: 178, వెల: రూ. 50

(ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం నుండి)