
సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి గా ప్రచురణ కర్త గా తెలుగు నాట ఒక విలక్షణమైన పేరున్న రంగనాయకమ్మ గారు పాఠకులకు చవక ధరలకు మంచి పుస్తకాలు అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. కేవలం 30 రూపాయలకే దీన్ని అమ్మాలని నిర్ణయించడం ద్వారా ఆమె తెలుగు పుస్తక రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించారు.
“కూర్‌స్క్ యుద్ధరంగంలో రష్యన్ల కోసం హిట్లర్ అందజేయబోతున్నాడని క్రితం మే నెలలో కుజ్నెత్సోవ్‌తో కోఖ్ చెప్పిన ‘అద్భుత బహుమానం’ సంపూర్ణమైన విఫలతతో అంతమైంది. నాజీలు లక్షా ఇరవై వేల సైన్యాన్ని నష్టపోయి తిరోగమనం చిత్తగించారు. సెప్టెంబరు చివరి రోజుల నాటికి ఎర్రసైన్యం ద్మీవ్ర్ నదీ తీరానికి పురోగమించింది. ఆత్మ విశ్వాసంతోనూ, ఆత్మసంతృప్తితోనూ ఒకనాడు మిడిసిపడిన జర్మన్లు ఆనాడు తాము విజయోన్ముఖులమనే విశ్వాసానికి తిలోదకాలిచ్చేసుకున్నారు…..”
‘దిటవు గుండెలు’ పుస్తకంలోని కొన్ని వాక్యాలివి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సోవియెట్ గెరిల్లాల వీరగాథను తెలిపే పుస్తకమిది. రష్యన్ భాషలో ద్మీత్రియ్ మెద్వేదెవ్ రాసిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు నుంచి ఉప్పల లక్ష్మణరావు అనువదించారు. దీనిని ఇప్పుడు రంగనాయకమ్మ మరోసారి ముద్రించారు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ, నాజీజం మీద జరిపిన పోరాటంలోనూ సోవియెట్ రష్యాది ఘనమైన చరిత్ర. అయితే ఆ పోరాటం ఎందుకు జరిగినట్టు? అంత త్యాగం ఎందుకు జరిగినట్టు? మళ్ళీ స్వార్థపరులకు అప్పగించడానికా? అన్న ప్రశ్న వేసుకుంటూ దీనిని ముద్రించారు. అదే సమయంలో మళ్ళీ అలాంటి వ్యక్తులు, త్యాగం భవిష్యత్తులో సాధ్యమవుతుందన్న నమ్మకం కూడా ఆమెకు ఉంది. ‘దిటవు గుండెలు’ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం. ఇప్పటి భాష కాకపోవడం వల్ల చదవడం కొంచెం శ్రమే.
దిటవు గుండెలు, రష్యన్ మూలం: ద్మీత్రియ్ మెద్వేదెవ్,
అను: ఉప్పల లక్ష్మణరావు. ప్రతులకు: నవోదయ బుక్ డిస్ట్రిబ్యూటర్స్,
కాచిగూడ, హైదరాబాద్. పేజీలు: 242, వెల: రూ. 30/-
సమీక్ష మూలం: ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం 10 జూన్ 2007

4 comments
Comments feed for this article
జూన్ 11, 2007 వద్ద 8:45 పూర్వాహ్నం
vbsowmya
పుస్తకాలను తక్కువ ధరకు అందరికీ అందుబాటు లోకి తేవాలన్న రంగనాయకమ్మ గారి ఆలోచన నిజంగా అభినందనీయం…అదీ ఆమె రచయిత్రి అయి ఉండీ అలా చెప్పడం మరీ అభినందనీయం. ఇక పోతే .. మీ టపా గురించి… ఆ రష్యా పదాలు తెలుగు లో రాయడం కష్టమైతే ఆంగ్లం లోనే రాయొచ్చు కదండీ. చాలా ఇబ్బందిగా ఉంది “ద్మీత్రియ్” , “ద్మీవ్ర్” – వంటి పదాలు చదవడానికి. ఆంగ్ల స్పెల్లింగులు రాస్తే చదువరులకు సులభంగా ఉంటుంది ఏమో?
జూన్ 11, 2007 వద్ద 12:44 అపరాహ్నం
Netizen
thank you!
జులై 9, 2007 వద్ద 11:28 పూర్వాహ్నం
somasankar
నేను అనువదించిన 42 కధల నుంచి, 19 కధలు ఎంచుకుని ‘మనీ ప్లాంట్ ‘ అనే పేరుతో ఒక సంకలనం ఇటీవల వెలువరించాను.
నా పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకల కొట్లలోను దొరుకుతుంది. మీరు చదివారా?
లేదంటే, ఆన్ లైన్ లో నా పుస్తకం పై సమీక్ష కోసం మీకు పంపడం ఎలా?
జులై 12, 2007 వద్ద 10:13 పూర్వాహ్నం
వీక్షణం
బ్లాగు దర్శించినందుకు కృతజ్ఞతలు. త్వరలోనే పుస్తకాలు సమీక్ష కోసం పంపే విధానం గురించి వివరాలు బ్లాగులో పొందు పరుస్తాము.