
ఒక వార్త, లేదా ప్రత్యేక వార్తాకథనం కోసం పత్రికా రిపోర్టర్ ఎంత శ్రమిస్తాడో చాలామందికి తెలియదు. ఎంతో కష్టపడి ఒక రిపోర్టర్ సమాచారాన్ని సేకరించి అద్భుతమయిన కథనాన్ని రాస్తే కొన్ని సందర్భాలలో ఆ వార్త ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకోవచ్చు. కొన్నిసార్లు అందుకు విరుద్ధంగానూ జరగవచ్చు. వార్తను ఆవిష్కరించడం ఒక ఎత్తయితే, దానిని పాఠకులు స్వీకరించడం మరో ఎత్తు. ఇటువంటి కొన్ని వార్తాకథనాల వెనుక ఉండే కథలను, వ్యథలను గ్రంథస్తం చేయడం గొప్ప విషయం. ‘వార్తల వెనుక కథ’ ద్వారా అటువంటి మంచి ప్రయత్నం చేసిన కె. రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి, డాక్టర్ ఎల్. విజయకృష్ణారెడ్డి, రొద్దం శ్రీనివాసులు అభినందనీయులు.’వార్తల వెనుక కథ’లో పేరు పొందిన, చేయి తిరిగిన పత్రికా రచయితలు రాసిన 45 వార్తా కథనాలు ఉన్నాయి. వార్తా సేకరణలో భీష్మపితామహుడనదగిన ధర్మవరపు సీతారాం నుంచి నాగసుందరి వరకు వారి అనుభవంలో, వారికి నచ్చిన కథనం గురించి చక్కగా వివరించారు.
ఎంతో సంచలనం రేకెత్తించిన కథనాలు కొన్ని పెద్ద ప్రయత్నం లేకుండానే వచ్చి ఒడిలో వాలుతూ ఉంటాయి. అందుకు నిదర్శనం – నిజాం మరణం గురించి సీతారాం రాసిన వార్త. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత హైదరాబాద్ నగరంలోని కింగ్‌కోఠి మీదుగా సీతారాం ఇంటికి వెళుతుండగా ఆనాటి ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామయ్య నిజాం ప్యాలెస్ నుంచి బయటకు రావడం చూశారాయన. అనుమానం కొద్దీ ఫోన్ చేసి డాక్టర్‌గారితో మాట్లాడారు. దాంతో నిజాం తుది ఘడియల గురించి వార్త వెలువడింది. అదే ఈ సంకలనంలోని ‘జర్నలిజం ఒక నషా’ కథనం.
పి.ఎస్.సుందరం రాసిన ‘ఏ సభలో ఏ వార్త దాగి వుందో?’ కథనం కూడా ఇలా సేకరించినదే. సాధారణంగా దినపత్రికలలో సాహిత్య సభల రిపోర్టింగుకు అంత ప్రాధాన్యం ఉండదు. కాని సుందరంగారు వెళ్ళిన సాహితీ సభలో అనుకోకుండా బెజవాడ గోపాలరెడ్డి, నటి భానుమతి మధ్య జరిగిన వాగ్యుద్ధం మంచి వార్తకు ప్రాణం పోసింది. ‘వార్తకు ప్రాణం వేగం’ అనే కథనంలో వార్తను సేకరించడం ఎంత ముఖ్యమో, దానిని సమయానికి పత్రికకు పంపడం కూడా అంతే ముఖ్యమన్న సంగతిని ఆదిరాజు వెంకటేశ్వరరావు వివరించారు. 1984 ఆగస్టు సంక్షోభం గురించి ఇనగంటి వెంకట్రావు తనదైన శైలిలో వివరించారు. ఇక మీడియాను రాజకీయ నాయకులు ఏ విధంగా ఉపయోగించుకుంటారో ‘జైల్‌సింగ్ వివాదం’ కథనం ద్వారా కె. శ్రీనివాసరెడ్డి వివరించారు.
ఒక ప్రత్యేక వార్త కోసం ఎన్ని నెలలు శ్రమించవలసి ఉంటుందో చెప్పే కథనం ‘చెమటలు పట్టించిన టైగర్లు’. వల్లీశ్వర్ అనుభవం ఇందులో ఉంది. ‘అడవిబాటలో రాజీవ్ గాంధీ’ కథనం వింతయినది. ఆకాశవాణికి చెందిన భండారు శ్రీనివాసరావు రాజీవ్‌తో కలిసి సాగించిన అడవి ప్రయాణం కథనం ఇది. ఒక వార్తను రాయడంలో పరిశోధనకు ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో విశ్లేషించారు మాడభూషి శ్రీధర్. ఈ కథనం పేరు ‘చూస్తే గోరంత’. నక్సలైట్ల చేతిలో బంది అయి, హత్యకు కూడా గురయిన తాడిచెర్ల మల్హర్‌రావు ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరబద్ధం చేశారు దేవులపల్లి అమర్. రాష్ట్రంలో ఈ తరహా మొదటి ఘటన అదే. దక్కన్ హెరాల్డ్‌కు చెందిన అఖిలేశ్వరి ‘నమీబియా ఓ నమీబియా’ ప్రత్యేకత కలిగిన మరో వార్తా కథనం. నమీబియాలో జరిగిన కొన్ని సంఘటనలను సేకరించి పంపడానికి ఎంత కష్టించారో ఇది చదివితే అర్థం అవుతుంది. ‘వార్తలను పసిగట్టడం’ ఎలాగో కొమ్మినేని శ్రీనివాసరావు సోదాహరణంగా చెప్పారు. ‘నకలీ వైద్యుల నాటకం’ ఏ విధంగా ముగిసిందో చక్కగా వివరించారు సి.ఆర్.గౌరీశంకర్.
అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయడం ఎంత రిస్కుతో కూడుకున్న వ్యవహారమో కళ్ళకు కట్టిన రాశారు పత్రికా రచయిత వివి రమణమూర్తి. కొండపల్లి సీతారామయ్యను కలుసుకున్న వైనాన్ని ఆయన హృదయానికి హత్తుకునే రీతిలో వర్ణించారు. ప్రభుత్వంతో చర్చల కోసం నక్సలైట్ నాయకులు నల్లమల అడవుల నుంచి బయటకొచ్చిన తీరుతెన్నులను, ఈ కథనాలను తాను హైదరాబాద్‌కు ఏ విధంగా పంపినదీ అల్లం నారాయణ ‘మరపురాని ఆ 24 గంటలు’ కథనంలో హృద్యంగా వర్ణించారు. ఎందరో పురోహితులను రుణ విముక్తులను చేసిన వార్తా కథనం ‘అయ్యవార్ల రుణవిముక్తి’. తన పెళ్ళిలో ఒక పురోహితుడు అప్రయత్నంగా బయటపెట్టిన విషయాన్ని ఆధారం చేసుకుని సి.వి.ఎన్. రమణారావు ఈ వార్తా కథనం తయారు చేశారు. కె. కరుణాకరరెడ్డి రాసిన ‘నీళ్ళస్వామి కథ’ ఒక దొంగస్వామి గుట్టును బట్టబయలు చేసిన కథనం. జర్నలిస్టులు వృత్తిలో భాగంగా ఎవరికయినా సాయం చేసేందుకు వార్త వేస్తే దాని ఫలితం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో చెప్పే కథనం ‘వెంటబడ్డ వార్త’. ఇది ఆర్ ఎం ఉమామహేశ్వరరావు రాశారు.
మహిళా రిపోర్టర్‌కు ఎదురయ్యే సాధకబాధకాల గురించి ‘వెంటాడిన దృశ్యాలు’లో నాగసుందరి చక్కగా రాశారు. మహిళా రిపోర్టర్‌కు విలువైన పాఠాలవి. సి. వనజ అందించిన ‘దండకారణ్యంలో జనతన సర్కార్’ కథనం ‘ది వీక్’ జర్నలిస్టు లలితా అయ్యర్ సల్వాం జుడుంపై రాసిన కథనానికి భిన్నమైన కథనం.
మొత్తంగా రిపోర్టర్‌కు ఉండే సాధకబాధకాల గురించి రామచంద్రమూర్తి ‘పాత్రికేయ విజయగాథలు’లో పేర్కొన్నారు. శేఖర్‌రెడ్డి ‘చోదకశక్తులు’ పేరుతో రాసిన ముందుమాటలో వార్తాసేకరణలోని లోతుపాతుల గురించి అందరికీ అర్థమయ్యే తీరులో వివరించారు. జర్నలిస్టు మిత్రులంతా కొని చదవదగ్గ పుస్తకం ‘వార్తల వెనుక కథ’. ఇటువంటి మరికొన్ని పుస్తకాలకు ఇది ప్రేరణ కావాలి.
- విజెయమ్ దివాకర్
(1 జులై, 2007 ఆదివారం ఆంధ్ర జ్యోతి అనుబంధం)
వార్తల వెనుక కథ,
సం: కె.రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి,
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి.
పేజీలు: 373,
వెల: రూ. 200/-

No comments yet
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు