annam.jpg

అంబుల పొదిలో అస్త్రశ్రస్తాలుంటే సరిపోదు, ఏ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో యుద్ధానికి వెళ్ళే వీరుడికి తెలిసుండాలి. అలాగే మెదడు నిండా ఆలోచనలు ఉంటే సరిపోదు, ఏ ఆలోచనను ఎలాంటి కథగా మలచాలో రచయితకు తెలిసుండాలి. ఆ విద్య బాగా తెలిసినవాడే సుంకోజు. అందుకే ఇందులో కథలన్నీ ఎంత ఉండాలో అంతే ఉండి, ఎలా ఉండాలో అలాగే ఉండి అందర్నీ అలరిస్తాయి, మెప్పిస్తాయి.ఈ అన్నంగుడ్డ సంపుటిలో మొత్తం 13 కథలున్నాయి. ప్రతి కథ ఓ జీవిత శకలం, ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని, ఎన్నో అనుభవాలను చవిచూసిన వ్యక్తి మాత్రమే ఈ కథలు రాయగలడంటే అతిశయోక్తి కాదు. రచయితకు జీవితం మీద కసి ఉంది. పట్టు ఉంది. సామాజిక దృక్పథం ఉంది. కష్టజీవుల పట్ల ప్రేమ ఉంది. వారి కష్టాన్ని నలుగురికీ తెలియజేయాలనే తపన ఉంది. అందుకే ఈ కథల్లోని పాత్రలన్నీ భగ్గున మండుతుంటాయి. కన్నీళ్ళతో కదిలిస్తుంటాయి. 

రచయితకు ఆకలితో ఎంత బంధం ఉందో, ఎంత స్నేహం ఉందో తెలియదు కానీ కథల్లో ఆకలి సన్నివేశాలు బాగా కన్నీళ్ళు పెట్టిస్తాయి. అన్నదాత కథలో నలుగురికీ అన్నంపెట్టే రైతు అన్నంకోసం పరితపించే సన్నివేశం, రాబందుల కథలో రామచంద్ర అనే పాత్ర కడుపు మాడ్చుకుని పనిచేసే తీరు రెండూ అలాంటివే.

కథలన్నీ కష్టజీవుల ఇతివృత్తాలే కావడం వల్ల కాబోలు దాదాపు అన్నింటిలోనూ ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. చివరికి పుస్తకం పేరు కూడా అన్నంతో సంబంధం ఉన్న పేరే కావడం విశేషం. అన్నంగుడ్డ కథలో చితికిపోతున్న వడ్రంగి బతుకు కనిపిస్తుంది. గాలికి కొట్టుకుపోతున్న వృత్తి కనిపిస్తుంది. కేవలం అన్నమే కాదు మమకారాన్ని కూడా అన్నంగుడ్డలో మూటకట్టుకు పోతారు పల్లె మనుషులు అని నిరూపిస్తుంది ఈ కథ. ఇక ఎంతెంత దూరం కథలో దూరమవుతున్న మానవ సంబంధాలు దగ్గరగా కనిపిస్తాయి. కొమ్మిపూలు కథలో పల్లె జ్ఞాపకాలు గుబాళిస్తాయి. పెళ్ళాలను కువైటుకు పంపించి ఏడిపించుకు తినే మగాళ్ళ బతుకులు గాలి కథలో అసహ్యం కలిగిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథ ఓ పదునున్న కత్తి. చందమామలో మచ్చలున్నట్టు ఈ కథల్లోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. సంభాషణలు నడిచేతీరు మరీ సుదీర్ఘంగా ఉండి బోర్‌ కొట్టిస్తాయి. పుస్తకం మొదట్లో రచయితతో కాసేపు అంటూ చాలాసేపే జొరబడి జోరీగ శబ్దం చేస్తాడు పలమనేరు బాలాజీ. ఇలాంటి లోపాలు మినహా ఈ పుస్తకం కథాభిమానులందరూ చదవదగ్గది.

-వేంపల్లె షరీఫ్‌


అన్నంగుడ్డ (కథల సంపుటి),

రచయిత: సుంకోజి దేవేంద్రాచారి,

ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు,

పేజీలు: 194,

వెల: రూ. 50/-

మూలం: జులై 8, 2007 ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం