
ఇవాళ్టి ముస్లిం కవికి తన అభివ్యక్తిని స్వేచ్ఛగా ప్రకటించే పరిస్థితి లేదు. తన జీవిత సంఘర్షణల వ్యక్తీకరణను అవతలివాళ్లు ఎలా తీసుకుంటారోననే భయసందేహాలతో ఇవాళ ముస్లిం బుద్ధిజీవులు బతకవలసిన స్థితి ఉంది. ఆ ఒత్తిడిలో వెలువడిన ముస్లిం యువకవుల సంస్కృతీ గీతాల సంకలనం ‘అలావా’.
‘ముస్లిం సంస్కృతి కవిత్వం’ అని ఈ పుస్తకానికి ఉన్న ఉపశీర్షిక చాల ఆలోచనా స్ఫోరకమైనది. ముస్లిం సంస్కృతి అనగానే మన సమాజంలో ఎన్నో అపార్థాలు, అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. వాటిని సృష్టించి, పెంచి పోషించే పనిని సంఘ పరివారం ఉద్దేశపూర్వకంగానే సాగిస్తోంది. ఆ తప్పుడు ప్రచారానికి మొత్తం సమాజమే తెలిసీ తెలియకుండా బలి అయిపోతోంది. అటువంటి సందర్భంలో ముస్లిం సంస్కృతి అంటే ఏ విలువలకు నిలబడేదో, దాని అంతస్సారం ఏమిటో నిర్దిష్టంగా , కచ్చితంగా ప్రకటించవలసి ఉంది. ఆ అవసరాన్ని తీరుస్తూ , ఇవాళ్టి తెలుగు సమాజంలో ముస్లిం సంస్కృతి కవిత్వం అంటే ఏమిటో కవితాత్మకంగా ప్రకటిస్తూ వెలువడింది ‘అలావా’. షాజహానా, స్కైబాబా సంపాదకులుగా డెబ్బై ఒక్కమంది ముస్లిం కవులు రాసిన 102 కవితల సంకలనం ఇది.
స్థానిక ముస్లిం ఆచార వ్యవహారాల వంటి సూక్ష్మ అంశాల నుంచి ఇస్లాం మీద అమెరికన్ పాలకవర్గాల దాడి వంటి అంతర్జాతీయ అంశాల దాకా అనేక అంశాలను సంలీనం చేసుకున్న ‘అలావా’ మీద విస్తృత చర్చకు అవకాశం ఉంది. ఒక చిన్న సమీక్షలో అది సాధ్యం కాదు.
ఈ కవులందరూ మంచి తెలుగు అభివ్యక్తితో ఈ నేలలో దృఢంగా నిలబడి మాట్లాడుతున్నారు. తెలుగు సమాజ జీవితంతో ముస్లిములకు ఐదారు శతాబ్దాలకు మించిన విడదీయరాని సంబంధమే ఉన్నది. ఈ ఐదారు శతాబ్దాలలో తెలుగులో రచన చేసిన ముస్లింలు కూడా ఉన్నారు. వారి అభివ్యక్తిలో తప్పనిసరిగా తమ సంస్కృతి లోని ప్రత్యేకతలు ప్రతిఫలించే ఉంటాయి. కాని గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగులో వస్తున్న ముస్లిం బుద్ధిజీవుల వ్యక్తీకరణ అనివార్యంగా తమ సంస్కృతి మూలాల అన్వేషణలోకి, తమ సంస్కృతి ని పునర్నిర్వచించడంలోకి, విమర్శనాత్మకంగా పరిశీలించడంలోకి పయనించవలసి వచ్చింది. ఇందుకు నేపథ్యం సమకూర్చినది బహుశా అంతర్జాతీయ వాతావరణం. ముఖ్యంగా అమెరికన్ పాలకవర్గాలు,
హంటింగ్‌టన్ వంటి మేధావులు వ్యాపింప చేస్తున్న ఇస్లామోఫోబియా వల్ల , సంఘపరివారం సాగిస్తున్న అబద్ధ ప్రచారాల వల్ల, భౌతిక దాడుల వల్ల ముస్లిం సంస్కృతి తనను తాను కొత్తగా దర్శించుకోవలసిన స్థితికి చేరింది. తెలుగు కవిత్వావరణంలో ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’తో మొదలయిన ఈ వెతుకులాట బాబ్రీ మసీదు విధ్వంసంతో , గుజరాత్ మారణకాండతో మరింతగా విస్తరించింది. ఈ సామాజిక, రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో మాత్రమే ‘అలావా’ కవిత్వాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
‘అలావా’లోని ప్రతి ఒక్క కవితా ముస్లిం సంస్కృతి ఇవాళ్టికి కూడా ఎంతటి నిప్పులగుండం (అలావా) మీద ఉన్నదో చూపుతుంది. ఇందులో స్థూలంగా నాలుగు రకాల కవితలు ఉన్నాయి. అవి ముస్లిం అస్తిత్వ ప్రత్యేకతను చెప్పేవి. ఇతర పీడిత అస్తిత్వాలతో సారూప్యతను ప్రకటించుకుని ఐక్యతను వాంఛించేవి. అన్ని పీడిత అస్తిత్వాల మీద హిందుత్వ, సంఘ పరివార శక్తులు సాగిస్తున్న దౌర్జన్యాన్ని ఖండించేవి. ముస్లిం అస్తిత్వానికీ, ప్రపంచానికీ కూడా శత్రువుగా ఉన్న సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించేవి. ఈ నాలుగు పాయల కవిత్వం ఏకధారగా ప్రవహించడంలోనే ముస్లిం సంస్కృతి ని ఈ కవులుగాని, అలావా సంపాదకులు గాని ఎంత విశిష్టమైనదిగా, ఎంత విశాలమైనదిగా చూస్తున్నారో తెలుస్తుంది.
ముస్లిం అస్తిత్వ ప్రత్యేకతను చెప్పే కవితలలో తమ ప్రత్యేకతా ఉన్నది. తాము పొందుతున్న అవమానాల పట్ల, అసమానతల పట్ల ఆక్రోశమూ ఉన్నది. అన్నారం యాకన్న దర్గా, జాన్ పాడ్ సైదులు దర్గా, చౌసేన్ వలీ సాహెబ్ దర్గా వంటి హిందూ ముస్లిం పీడిత, మతాతీత సామూహిక జీవన దృశ్యాలూ ఉన్నాయి. పండుగలు, స్త్రీల స్థితి, పర్సనల్ లా, వివాదాలు, పాకిస్తాన్, ప్రేమ వంటి అన్ని ఇతివృత్తాలలోనూ ముస్లింలకు ముస్లిమేతర సమాజంతో ఉన్న ఐక్యతనూ, ఘర్షణనూ కూడా ఈ కవితలు చిత్రించాయి. ముస్లిం సమాజంలోనే అంతర్గతంగా ఘర్షణ పడవలసిన అంశాలనూ ఎత్తి చూపాయి. ఇతర పీడిత కులాలతో, వర్గాలతో ఈ దేశపు ముస్లిములకున్న పేగు బంధాన్ని కూడా వివరించడానికి కొన్ని కవితలు ప్రయత్నించాయి. ఆ ఉమ్మడి స్వభావం అర్థమయిన తర్వాత, తమ ఆరాటాలూ పోరాటాలూ ఏకం కావలసిన అవసరం కూడా కొన్ని కవితలలో వ్యక్తమయింది.
‘కమలం ఇప్పుడు మా నెత్తుటి మడుగులో పూచిన పువ్వు’అని గుజరాత్ మారణకాండలో వెల్లడయిన హిందుత్వ దుర్మార్గాన్ని ఖండించిన కవితలూ ఉన్నాయి. ‘వాడు ఒక్కొక్క దేశాన్నే/ మింగుతూ వస్తున్న అనకొండ/ వాడి దిష్టి కళ్ళ నుంచి / నా దేశాన్నెలా కాపాడుకోను?’ అని సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన కవితలూ ఉన్నాయి.
అలావా చదవడం గొప్ప అనుభవం. గుజరాత్ గాయపు అనంతర భారతంలో ముస్లిమేతర ఆలోచనాపరులందరూ పొందవలసిన అనుభవం. -
అలావా (ముస్లిం సంస్కృతి కవిత్వం),
సంపాదకులు: షాజహానా, స్కైబాబ,
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో.
పేజీలు: 162,
వెల: రూ. 50/-
మూలం: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 15 జులై, 2007

1 comment
Comments feed for this article
జులై 18, 2007 వద్ద 6:18 పూర్వాహ్నం
జాన్ హైడ్ కనుమూరి
భిన్నమైన జీవన చిత్రణ ఇందులో కనిపిస్తుంది