
కొల్లూరి సోమశంకర్ అనువాద కథల సంకలనం ‘మనీప్లాంట్’ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, జండర్ మూలాలను స్పశిస్తూనే …. మనిషి అంతరాంతరాల్లో దాగున్న మనస్తత్వ నీడల్ని సైతం పొరలు పొరలుగా మన ముందు పెడుతుంది. పుస్తక పరిచయంలో గుడిపాటిగారు అన్నట్టు ‘జీవిత వైశాల్యం, విస్తృతులను’ ఇవి అనుభవంలోకి తెస్తాయి. ప్రపంచీకరణ తర్వాత తీవ్రమైన వినిమయ సంస్కృతిని, బలహీనపడ్డ అనుబంధాల్ని… మానవీయ విలువల రాహిత్యాన్ని ‘సూక్ష్మ’ రూపంలోనే అయినప్పటికీ ఈ కథలు శక్తివంతంగా అద్దంపడతాయి. అన్నింటికన్నా రచయిత ‘అనువాద రీతి’ కొత్తపాఠకుల నుంచి తలపండిన పాఠకుల వరకూ మెప్పించే రీతిలో ఉండడం విశేషం. ఎంతో సరళమైన భాషా సౌందర్యాన్ని తన అనువాద ప్రక్రియలో ఆయన అనుసరించారు.
వీటిల్లో ఎక్కువ ఇంగ్లీషు భాష నుంచి చేసినవైతే, మిగతావి హిందీ, కాశ్మీరీ, తమిళం భాషల్నించి చేసినవి. ‘పెరుగన్నం’ కథ పసిపిల్లల స్ఫటికంలాంటి మనసుకు అద్దంపడుతుంది …పెద్దవాళ్ల మరుగుజ్జు మనస్తత్వాన్ని విప్పిచెబుతుంది. ‘సెల్‌ఫోన్’ మనిషి యంత్ర నాగరికతకు ఎంత బానిసయ్యాడో చెబుతుంది. ‘ఓ మనిషీ, ఎందుకిలా?’ కథ ఆడపిల్లపై ఉండే చిన్నచూపునే కాదు దుర్భరమైన ఆర్థికపరిస్థితులు ఆడపిల్లని ఎంత నిర్దయగా వొదిలించుకునేలా చేస్తున్నాయో నేటి సమాజ వాస్తవిక దృశ్యాన్ని మన ముందు ఉంచుతుంది. చెరువుతో పెనవేసుకుని ఉన్న నీళ్ల బంధం, మానవ నాగరికత, సంస్కృతి, మానవ సంబంధాలని డబ్బు ఎరచూసి మల్టీనేషనల్ ‘బుల్డోజర్స్’తో ‘ధూళి’గా మార్చేసిన వైనాన్ని ‘చెరువు’ కథ అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ‘చెరువు’ యజమాని గుండెనే కాదు మన గుండెల్నీ కన్నీటి సముద్రం చేస్తుంది.
‘అమ్మ వస్తే బాగుండు’, ‘బొమ్మ’, ‘బాకీ’ కథలు మృత్యువు … రక్తసంబంధాలు … మానవ జీవితాల్ని కుదిపేస్తున్న ఎక్కువతక్కువ వివక్షల్ని ముందుపెడతాయి. లాటరీ ఆశ బలహీన మనస్కుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నదీ హిందీ కథ ‘లాటరీ’ చెపుతుంది. కథలన్నింటిలోకి ‘సున్నాగాడు’ విలక్షణమైంది… ఎంతో లోతైనది … శూన్యంలోని ‘నిండుదనాన్ని’ సం’పూర్ణం’గా చూపిస్తుంది. ‘వృత్తిధర్మం’ ప్రేమలోని పరమార్థాన్ని విప్పిచెప్పే కథ. ‘మనీప్లాంట్’ టైటిల్ కథ సమకాలీన సమాజంలో విదేశాలకు తరలిపోతున్న మధ్యతరగతి జీవితాల్లోని డాలర్ ఆశల్ని వెల్లడిస్తుంది. విదేశాల్లో ఉపాధి వెతుక్కుని మగపిల్లలు వెళ్లిపోతుంటే, అమ్మానాన్నలకు ‘మనీప్లాంట్’ తీగలాగ ఆర్థిక ఆసరాగా నిలవడానికి అమ్మాయిలు సిద్ధపడుతున్న జీవనసత్యాన్ని ఈ కథ విప్పిచెబుతుంది. అంతేకాదు అలాంటి కుటుంబాల్లో కనిపించే ‘డాలర్ సంస్కృతి’ ని పట్టిచ్చే కథే ‘ఆశా నిరాశేనా?’.
మంచి కథల్ని ఎంచుకున్నందుకు, మంచి అనువాదం చేసినందుకు కూడా సోమశంకర్ అభినందనీయులు.
-నాగసుందరి
‘మనీప్లాంట్’ (అనువాద కథలు),
రచయిత: కొల్లూరి సోమశంకర్,
పేజీలు: 104,
వెల: రూ. 40/-
ప్రతులకు:
**కస్తూరి పద్మ, ప్లాట్ నెం.32, దమ్మాయిగూడ, నాగారంపోస్ట్,
ఇ.సి.ఐ.ఎల్ పోస్టాఫీస్, హైదరాబాద్- 500 062;
**విశాలాంధ్ర అన్ని శాఖలు.
———
మూలం: ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం – జులై 23, 2007

No comments yet
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు