
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు. తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా మనసుపెట్టి రాసేవారు. ఒక రచనకు డబ్బులు వస్తాయా రావా అన్న గీటురాయి కూడా ఆయన ఎప్పుడూ పెట్టుకోలేదు. తాను చేసే రచన లక్ష్యాన్ని ఆయన ఎంత పట్టించుకొనేవారో తెలియదు. కాని ఆయన రచనను ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా చేసేవారు. ఈ సంగతి ఆయన తన రచనాకార్యక్రమం కొనసాగిస్తున్నప్పుడు గమనించినవారికి తెలుసు. అలా ప్రత్యక్షంగా గమనించకపోయినా ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారందరికీ తెలుసు. అందుకే సహవాసి తన రచనా కార్యాన్ని మోహించినంతగా రచనాలక్ష్యాన్ని ప్రేమించలేదేమో అనిపిస్తుంది. ఆయన తన రచనాక్రియతో శృంగారం నెరిపేవారనిపిస్తుంది.
ఆయనకు భాషమీద అమోఘమైన పట్టు ఉంది. అటువంటిపట్టులేని వారిలో కనిపించే మోజూ ఉండేది. అదే ఆయనని దగ్గరగా చూసేవాళ్ళకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. ఆయనలో ఇంకా ఇటువంటివే ఎన్నో చిత్రాలు కనిపించేవి. ఆయన తన అనువాదాల్లో అత్యంత సంక్లిష్టమైన సన్నివేశాన్ని, ఎంతో సంకీర్ణమైన మానసిక ఘర్షణనీ పాఠకునికి అందించగలిగిన నేర్పు ప్రదర్శించేవారు. అయితే తనచుట్టూ జీవితంలో ఉన్న అతిచిన్న మెలికను కూడా పసికట్టేవారు కాదు. అంతటి అమాయకత్వమూ, పసిపిల్లల్లో మాత్రమే కనిపించే మనస్తత్వమూ ఈ ప్రౌఢరచయితకు ఎలా సాధ్యమా అని ఆశ్చర్యం కలిగేది. ఆయన సంపాదకీయంలో కనిపించే విశ్లేషణాశక్తిగాని, ఆ పరిణతిగాని తన పరిసరాలను పరికించేటప్పుడూ, తనచుట్టూ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడూ కలికానికి కూడా కానవచ్చేవి కాదు. ఆయన స్వతహాగా వినయశీలి. తన మనుమల వయసున్న పిల్లల దగ్గర సైతం వినయంగా, ఎంతో మర్యాదగా ఉండే తత్వం ఆయనది.
అతి సాదావ్యక్తుల్ని సైతం ఎంతో గౌరవంగా, సాదరంగా పలకరించే మనిషి ఆయన. అయి తే ఆయనకి అప్పుడప్పుడు కోపం వచ్చేది. కొన్నిసార్లు అది పిచ్చికోపం. కొన్నిసార్లు సత్యాగ్రహం. ఏదైనా అది పెద్దపెట్టున ముంచుకువచ్చేది. అప్పుడు ఎదురుగా ఉన్నది సాక్షాత్తూ త్రిమూర్తులే అయినా జడుసుకొనేలా తిట్టేవారు. అయితే అటువంటి సందర్భాలు ఆయన జీవితంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఆయన జర్నలిస్టుగా అనేకపత్రికల్లో పనిచేశారు. ఎక్కువకాలం ఈనాడులో చేశారు. 1983నుంచి 1996 వరకూ అక్కడే ఉన్నారు. ఆయనలో విశేషమేమంటే ఫ్రీలాన్సర్‌గా ఈనాడులో ఫీచర్స్ రాసినప్పుడు ఎంత శ్రద్ధగా రాశారో సంపాదకీయాలు రాసినా అంతే శ్రద్ధగా రాశారు. అంతేకాదు, ఈనాడు తరువాత ఆయన పొట్టపోసుకోవడానికి అనేక చిన్నపత్రికల్లో పనిచేశారు. రాశారు. పత్రిక చిన్నదయినా, పెద్దదయినా-జీతం ఎక్కువయినా, తక్కువయినా -తాను రాసే రాతలో అశ్రద్ధని జొరపడనివ్వలేదు.
తన యజమాని అభిరుచి ఉన్నవాడయినా, లేనివాడయినా ఆయనకి తన రచన విషయంలో ఎన్నడూ చిన్నచూపులేదు. ఆయనలో ఉన్న రచయిత విలువ తెలిసినవారు అడిగినప్పుడూ, పద్దులు రాయడానికీ సంపాదకీయం రాయడానికీ మధ్య ఉండే తేడా తెలియనివారు అడిగినప్పుడూ ఆయన ఒకే తీరున స్పందించేవారు. అదే వింతగా అనిపించేది. రాయమని అడిగినవారికి ఆయన ఎప్పుడూ రాయననలేదు. ఆయన తన రాతకి తప్ప ఎవరికీ విధేయుడు కాదనిపించేది. ఆయన తన ఎజి ఆఫీసులో అనుభవాల గురించి గానీ, తన జర్నలిస్టు జీవితంలో ఎదురయిన సాధకబాధకాల గురించిగానీ మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఆయన చదివిన ఒక పుస్తకం గురించో, అందులో ఒక పాత్ర గురించో, తను చేసిన ఒక రచన గురించో మాట్లాడుతున్నపుడు ఆయనలో కనిపించే ఉత్సాహంగానీ, ఉద్వేగంగానీ తాను రోజూ వ్యవహరించే వాస్తవప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు ఏ కోశానా కనిపించేదికాదు. అనువాదకుడిగా ఆయన సంపాదించింది అతి పరిమితం. తెలుగులో ఆయన అనువాదం చేసిన ఒక పుస్తకం అత్యధిక ముద్రణలకు నోచుకుంది. దానికి ముట్టిన పారితోషికం గురించి అడిగాను.
పారితోషికం సంగతి అలాపెట్టి-తాను ఎజి ఆఫీసులో ఉద్యోగానికి కొంతకాలం సెలవుపెట్టి ఆ పుస్తకాన్ని అనువదించాననీ, ఆ కాలంలో తాను తాగిన సిగరెట్లకి సరిపడా కూడా తనకి డబ్బులు ముట్టలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే ఎప్పుడూ అటువంటి విషయాలమీద ఊరికే ఫిర్యాదు చేస్తూ కూర్చోలేదు. చిట్టచివరి రోజు వరకూ తన రాతమీద బతికిన మనిషి సహవాసి. ఆ పని ఆయన ఎంతో ఇష్టంగా సహజంగా చేశారు. శ్వాసించడం ఎంత సహజమో, రాయడం అంతసహజం అన్నట్టుగా ఆయన జీవించారు. ఆయననుంచి ఆయన రచనాకార్యక్రమాన్ని ఏ విషయమూ వేరు చేయలేదు, ఒక్క మరణం తప్ప. ఆయన పీకాక్ క్లాసిక్స్‌కి ‘అమ్మ’ నవలను సంక్షిప్తం చేసి పెట్టారు. ‘పంచతంత్రం’ రాసిచ్చారు. చివరిలో గుణాఢ్యుని ‘బేతాళ కథలు’ ఇచ్చారు. ఆయన స్వయంగా ప్రచురించుకొన్న రెండు గ్రంథాలు ‘తిరస్కృతులు’, ‘విముక్తి’ వీలుంటే పునర్ముద్రించమని ఇచ్చారు. ఈ మూడు పుస్తకాలూ వెలికి తీసుకురావడంలో జాప్యం జరిగింది. ఈలోగా ఆయన కన్నుమూశారు. అందుకే నాకు చెప్పరానంత దుఃఖంగా ఉంది. కన్నీటితో…
- ఎ.గాంధి
పీకాక్ క్లాసిక్స్
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 30 ఆగస్ట్ 2007 నుండి

1 comment
Comments feed for this article
ఆగష్టు 31, 2007 వద్ద 12:07 అపరాహ్నం
నెటిజెన్
అవును.
మళ్ళి సహవాసి లాంటి రచయిత ఎన్నేళ్ళకు దొరుకుతాడో తెలుగు సాహిత్యానికి?