ఇంటీరియర్ డెకరేషన్‌కు అనువుగా బాపు వేసిన రంగురంగుల చిత్రాలను ఒక అందమైన కాటలాగ్‌లా తయారుచేసి, వాటికి నెంబర్లు ఇచ్చి కావలసిన వారికి వాటిని ఎన్‌లార్జిచేసి ఇచ్చేందుకు వీలుగా ‘హరివిల్లు’ పేరుతో ఒక చక్కటి పుస్తకాన్ని ప్రచురించారు విజయవాడ రైన్‌బో ఆర్ట్ సీరీస్‌వారు. ఈ పుస్తకం గురించి రాయబోయే ముందు బాపు చిత్రకళ గురించి కొంత సింహావలోకనం చేయవలసి ఉంది.
సాహిత్యంలో ఈ శతాబ్దం నాదని రొమ్ము విరుచుకుని మరీ చెప్పుకున్నాడు శ్రీశ్రీ. అలా ‘గత శతాబ్దంలో తెలుగునాట విచ్చుకున్న చిత్రలేఖనానికి రేఖా నిర్దేశం చేసినవాణ్ణి నేనని’ బాపు చెప్పుకోలేదు కాని కొండంత ఆత్మవిశ్వాసంతో, గర్వంగా ఆ మాటల్ని బాపుకున్న లక్షలాది మంది అభిమానులు తమ మనస్సుల్లో అనుకున్నారు. 1945వ సంవత్సరంలో బాల అనే పిల్లల మాసపత్రిక ద్వారా చిత్రలేఖనంలోకి అరంగేట్రం చేసిన బాపు ఆనాటి నుంచి ఈనాటి వరకూ వామనమూర్తిలా ఎదుగుతూ పోయాడు. ఆ ఎదుగుదల ఇంకా సాగుతూనే ఉంది.
![]()
సుమారు 30 సంవత్సరాల క్రితం రసజీవి సంజీవదేవ్ బాపు చిత్రకళ గురించి ఒక వ్యాసం రాస్తూ ఆయన రేఖలు ఎంత సొగసుగా ఉన్నా, ఎవరో రాసిన కథలకు బొమ్మలు వేసే ఇల్రస్టేటర్, కార్టూనిస్టు కావటంతో కమర్షియల్ ఆర్ట్‌గా తప్ప నిజమైన సీరియస్ కళగా పరిగణించడానికి లేదన్నారు. ఆయన చెప్పిన మాటలు ఘాటుగా ఉన్నాయనిపించినా, అందులో కొంత నిజం లేకపోలేదనిపించింది. ‘మీరు చెప్పినవి చాలామందికి వర్తిస్తాయి కాని, బాపుకు వర్తించవని’ నేను ఆయనతో విభేదించాను. దానికి కారణం ఆర్.కె.లక్ష్మణ్ లాంటి ప్రసిద్ధులు కార్టూన్‌లు వేసినా, కథలకు బొమ్మలు వేసినా, కారికేచర్‌లు వేసినా అన్నీ ఒకే రకమైన గీతలతో నిండి ఉంటాయి తప్ప వాటిలో భేదం ఉండదు. 1960 దశకంలో మన దేశంలో వివిధ భాషలలో వచ్చే ఏ పత్రికలోనూ – అది హిందీ ధర్మయుగ్ కావచ్చు, తమిళంలోని కుముదం కావచ్చు. కథలకు వేసే బొమ్మలు బాపు ఆనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో వేసే బొమ్మలకు కనీసం నాభి స్థాయి వరకైనా రాలేకపోయేవి. అంతేకాదు ఆనాడు అనన్య సామాన్యంగా వెలిగిన ఇల్రస్టేటెడ్ వీక్లీలో రావి శాస్త్రి రాసిన ‘పావలా’, ‘కార్నర్ సీటు’ కథలు ఇంగ్లీషులోకి అనువదించబడి ప్రచురించబడినప్పుడు వాటికి వేసిన రంగుల బొమ్మల కంటే, అవే కథలకు బాపు భావస్ఫోరకంగా వేసిన చిన్న గీతాచిత్రాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. అవి చూస్తే చాలు మనకి అర్థమవుతుంది మన బంగారం ఎంత శుద్ధమయినదో.

బాపు వేసే బొమ్మలు కొన్నిచోట్ల కథనే డామినేట్ చేసేటట్టు ఉండేవి. ఆ రేఖాచిత్రాలలో బాపు ఒక కొత్త ప్రక్రియను అనుసరించారు. కంటికి దగ్గరగా ఉండే వాటిని పెద్దవిగా, దూరంగా ఉండే వాటిని చిన్నవిగా గీస్తూ థర్డ్ డైమన్షన్‌ను (మూడవ అయితనాన్ని) రేఖల సాయంతోనే సృష్టించగలిగేవాడు. డ్రాప్ట్స్‌మాన్‌షిప్ కంటే ఒక కళాకారుని గొప్పతనాన్ని నిగ్గుతేల్చే గీటురాయి మరొకటి లేదు. ఇది ఒక ప్రాథమిక సూత్రం. అందులో బాపుకు నూటికి నూరు శాతం మార్కులు లభిస్తాయి. డావిన్సీ వేసిన రేఖాచిత్రాలను చూస్తే ఇది మనకర్థమవుతుంది. ఆనాడు రీడర్స్ డైజెస్ట్‌లో వచ్చే కథల బొమ్మల్ని ఎవరైనా చూసి ఉంటే బాపు బొమ్మలు వాటితో సమాన స్థాయిలో వున్న విషయం గుర్తిస్తారు.
బాపు తాను ఒక్కడిగా ఉంటూనే చతుర్ముఖ బ్రహ్మలా అనేక భిన్నమైన రేఖా ప్రక్రియలను సొంతం చేసుకున్నాడు. కార్టూన్లకు వేసే గీతలకు, కథలకు వేసే వాటికి, కేరికేచర్‌లో వేసేవాటికి ఎక్కడా పోలికే ఉండదు. అలానే పౌరాణిక గాథలలో కొన్నిటిని జానపద శైలిలో, కొన్ని తంజావూరు శైలిలో, మరికొన్ని పదహారవ శతాబ్దం నాటి విజయనగర కంచువిగ్రహ శైలిలో గీస్తూ తన బహుముఖ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ప్రచురించబడిన ఈ ఆల్బమ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆల్బమ్‌లో ఉన్న ఆర్ట్ నెం. 213 గీతోపదేశం చిత్రంలో బాపు పెడన, కాళహస్తిలలో ఉండే కలంకారీ శైలిలో చిత్రాన్ని గీసి మెప్పించటం చూడవచ్చు. అలానే భారత, రామాయణ గాథలేగాక ఆర్ట్ నెం. 288లో క్రీస్తు జననాన్ని చిత్రించారు. ఇందులో ప్రాచ్య, పాశ్చాత్య ధోరణులు రెంటినీ గొప్పగా మేళవించారు. శేషతల్పంపై శయనించిన నారాయణుణ్ణి రెండు భంగిమలలో ఆర్ట్ నెం. 076, 089లలో చిత్రించి తాను ఒకే విషయంపై ఎన్ని భిన్న ప్రక్రియలకు పోగలడో మన ముందుంచాడు.
చిత్రకళలోని ఏ ప్రక్రియనైనా బాపు చాలా సులువుగా ప్రావీణ్యం సాధించగలుగుతాడు. అందుకు తాజా తార్కాణం బాపు వేసే రంగుల బొమ్మలు. మొన్నటి వరకూ బాపు రేఖా చిత్రాలు గీస్తూ, ఆ రేఖల మధ్య రంగును నింపుకుంటూ (ఞటజీఝ్చటడ ఛిౌజూౌటట ౌnజూడ, nౌ్ట ్టౌn్ఛట) వచ్చేవాడు. ఇప్పుడు టోనల్ రంగుల చిత్రాలలో కూడా తన ప్రతిభను నిలబెట్టుకున్నాడు. అందుకు ఉదాహరణలుగా నిలబడతాయి ఆర్ట్ నెం. 368 ఉత్తరం చదువుతున్న అమ్మాయి, ఆర్ట్ నెం. 279 సత్యసాయిబాబా, ఆర్ట్ నెం. 093 బాలకృష్ణుని నోటిలో విశ్వరూపాన్ని వీక్షిస్తున్న యశోద. ఇవికాక ఆర్ట్ నెం. 339లో బాపు సాధించిన సున్నితమైన వర్ణవిశేషాలు మనం గమనించవచ్చు.

చారడేసి కళ్ళు, బారెడేసి జడ, దాని చివర జడగంటలతో పదహారణాల తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని తన చిత్రాలలో ద్విగుణీకృతం చేశాడు బాపు. వీపు మీద వేలాడే జడపై ఆయనకు మక్కువ ఎక్కువనుకుంటాను. అది సమయం చిక్కితే చాలు వైకుంఠపాళీలో పాముల్లా మెలికలు తిరుగుతూ వింత పోకడలు పోతుంది బాపు చిత్రాలలో. ఏ రెండు చిత్రాలలోనూ జడ ఒక్కలా ఒంపులు తిరగదు. అసలు బాపు ఏ రెండు చిత్రాలూ ఒక్కలా ఉండవు. అదే ఆయన ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన బాపును ఆర్టిస్టే కాదని (అనేవారు కొందరున్నారు) ఎవరైనా అంటే విరుచుకుపడేవాడు చలసాని ప్రసాదరావు. నిజంగా ఇప్పటికీ అలా ఎవరైనా భావిస్తే అది ఆర్టిస్టు అన్న పదాన్నే కించపరచిన వారవుతారు. వారు బాపునే కాదు అతని మార్గంలో సాగుతున్న అప్రతిమాన ప్రతిభావంతులు, బాపు అంతేవాసులైన చంద్ర, బాలి, మోహన్‌లతో పాటు అనేకమంది బాపు ఏకలవ్య శిష్యులను కూడా అర్థరహితంగా కించపరచినట్లవుతుంది. ఈ రోజు భారతదేశంలో ప్రతిభావంతమైన రేఖా చిత్రకారులు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. దీనికి బాపుయే దిశా నిర్దేశకులు. ఇది నేను ప్రాంతీయ అభిమానంతో చెబుతున్న మాటకాదు. ఇంత చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చిన గంధం దుర్గాప్రసాన్ (నేను డి.సి (సి.టి)గా విజయవాడలో ఉన్నప్పుడు నా వద్ద పని చేశాడు) నా వాడే కావటం నాకు మరింత ఆనందాన్నిస్తుంది. అతన్ని అభినందిస్తున్నాను.
తాజాకలం
బాపు చిత్రకళను ఎక్కడా, ఏ లలితకళాశాలలోనూ అభ్యసించలేదు. కొంతకాలం ‘గోపూ’ అనే ఆయన వద్ద రేఖాచిత్రాల మూలసూత్రాలు నేర్చుకున్నట్టుగా ఆయనే చెప్పినట్టు గుర్తు. బాపు చిత్రకళ స్వయం సిద్ధం, స్వాభావికం. ఆయన చిత్రాలకు ఆయనే గురువు, ఆయనే శిష్యుడు. బొమ్మలు వేస్తూ వేస్తూ సాధించిన ప్రావీణ్యమది. అందుకని తనలానే గురువు లేనివారికి పాఠాలుగా ‘ఏౌఠీ ఐ జ్ఛ్చూటn్ఛఛీ ్టౌ ఛీట్చఠీ’ పేరుతో బాపు స్వదస్తూరీతో ఇంగ్లీషులో రాసిన ఒక వ్యాసాన్ని ఈ పుస్తకం చివర ప్రచురించారు.
అది ఈ పుస్తకంతో పాటు మనకు లభించే బోనస్.
ఇది ఖచ్చితంగా ప్రతి తెలుగువారింట ఉండదగ్గ పుస్తకం. మీ బంధువులలో కాని, మిత్రులలో కాని చిత్రకళపై మక్కువ చూపిస్తున్న పిల్లలెవరైనా ఉంటే వారికి ఈ పుస్తకాన్ని బహూకరించండి. వారు ఆజన్మాంతం మిమ్మల్ని మరువరు.
హరివిల్లు: బాపు బొమ్మలు ఫర్ ఇంటీరియర్ డెకరేషన్స్ (క్యాటలాగ్), సంపాదకుడు: గంధం కనక దుర్గాప్రసాద్,
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ.
పేజీలు: 140, వెల: రూ. 500/-
-కాండ్రేగుల నాగేశ్వరరావు
(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)


No comments yet
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు