చూడగలిగితే ప్రతి మనిషీ ఓ విజేతే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. పుట్టింది ఎక్కడైనా… అనుభవాల బాట సాగి, బాధల అగాథాల్లో దుమికి, ఆనంద జలపాతమై ఎగసి, కష్టాల మురికిని కలుపుకుని, ఇష్టాల నురగకు మురుసుకుని సాగే బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.అందరూ మానవులే అయినా ఒక్కొక్కరి రూపు వేరు, తీరు వేరు, ఆశలు వేరు, ఆశయాలు వేరు.జీవితాన్ని చూసే కోణం వేరు. సమస్యలకు స్పందించే గుణం వేరు.మనిషి జీవితం కంటే ఆసక్తికర అంశం ఈ అవనిపై మరొకటి లేదు.అందుకే ఆత్మకథలకు అంత పేరు. ‘పేరు’కు తగ్గట్టే ఆదరణా.తమకు మాత్రమే తెలిసిన తమ జీవితాన్ని, తాము చెప్పకపోతే మట్టిలో కలిసిపోయే వాస్తవాల్ని, ఏ ముసుగులూ లేకుండా ఆవిష్కరించిన జీవితచరిత్రలు ప్రపంచాన్ని కదిలించాయి, కరదీపికలై నడిపించాయి.అంత ప్రభావం ఉన్నా లేకున్నా ఇప్పుడూ ఆత్మకథలు విడుదలవుతూనే ఉన్నాయి. వెున్న వైజయంతిమాల, నిన్న దేవానంద్, నేడు ఎవరు… అన్నట్టుగా వచ్చిపడుతూనే ఉన్నాయి.
జీవితంలో చివరి అధ్యాయానికి ముందు…
సంపూర్ణ మూర్తిమత్వం పొందిన తర్వాత…
లౌకిక అలౌకిక స్థితికి మధ్యలో…
సాధారణంగా ఆత్మకథకు శ్రీకారం చుడతారు.
వృద్ధాప్యం నిబంధన కాదుగానీ ఓ వయసుకు వచ్చాకే ఆ ఆలోచన రావడం సహజం. అప్పుడే తమను తాము వెల్లడించుకోవాలనిపిస్తుంది. ఇన్నేళ్లుగా చెప్పలేకా చెప్పాలనిపించకా మనసు అరల్లో దాచుకున్న సంగతులన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది. అదే ఆత్మకథగా రూపుదాలుస్తుంది. ఈమధ్య శివాజీ గణేశన్ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ యాక్టర్’ విడుదలైంది. వైజయంతిమాల ‘ఎ మెవెుయిర్’ వెలువరించారు. భమిడిపాటి రామగోపాలం ‘ఆరామగోపాలం’ వచ్చింది. పోయినేడు ఈ జాబితాలో డి.వి.నరసరాజు(అదృష్టవంతుని ఆత్మకథ), మృణాళినీ సారాభాయ్(ద వాయిస్ ఆఫ్ ది ఆర్ట్) లాంటివాళ్లు ఉన్నారు. అంతకుముందు గుమ్మడి ‘తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు’ పేరిట తన జీవితాన్ని అక్షరబద్ధం చేసుకున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే కిరణ్‌బేడి(ఐ డేర్), కుష్వంత్‌సింగ్(ట్రూత్, లవ్ అండ్ లిటిల్ మ్యాలిస్), కపిల్‌దేవ్(స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్), బిల్‌క్లింటన్(మై లైఫ్), పండిట్ రవిశంకర్(రాగమాల), యామినీ కృష్ణమూర్తి(ఎ ప్యాషన్ ఫర్ డాన్స్), మన్నా డే(….మెవెురీస్ కమ్ అలైవ్: యాన్ ఆటిోబయోగ్రఫీ), సునీల్ గవాస్కర్(సన్నీ డేస్)… ఈ జాబితాకు కామా మాత్రమే పెట్టగలం. ‘భవిష్యత్తు గురించిన కుతూహలాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడే, ఆత్మకథ రాసే వయసుకు చేరినట్టు లెక్క’ అంటారు బ్రిటన్ రచయిత ఎవెలీన్ వా. ఆ సంగతేవోగానీ, తమ ఆత్మకథను పాఠకులు ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఆ రచయితల్లో మిగిలే ఉంటుంది.
ఉన్నది ఉన్నట్టు…
‘రొమాన్సింగ్ విత్ లైఫ్’… ఎనభై నాలుగేళ్ల దేవానంద్ తన ఆత్మకథకు తగిన పేరే ఎంచుకున్నారు. హిందీ సినిమాలకు సంబంధించినంతవరకూ రొమాంటిక్ హీరోగా దేవ్ ఓ చరిత్ర. ఆ ఇమేజీకి తగ్గకుండానే బాంబులు పేల్చారు. శృంగారనాయకి జీనత్ అమన్‌ి మీద మనసు పారేసుకున్న వైనాన్నీ నటగాయని సురయ్యా తనకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్నీ దాచుకోకుండా పుస్తకంలో పరిచేశారు. మరి కొందరు స్త్రీల దృష్టాంతాలనీ ఆయన బయట పెట్టుకున్నారు. అవి రాయాలని నియమం ఏమీ లేదు. కానీ తనకు సంబంధించి ఇంకా ఏదో చెప్పుకోవాలి… తన గుండెగదుల్లో దాగుండిపోయిన వాస్తవాలను వెల్లడించి భారం దించుకోవాలి… అన్న భావనే దీనికి కారణం అయ్యుండొచ్చు. రచయిత కుష్వంత్‌సింగ్ ఆత్మకథా అంతే. ‘నా ఆత్మకథ రాసేముందు సంకోచించాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొందరిని బాధించే అవకాశం ఉంటుంది. అయితే నా కూతురు రాయమని బలవంతపెట్టింది. ‘నీకు నా మీద ఎంతో గౌరవాభిమానాలుండొచ్చు. కానీ నా ఆత్మకథ చదివితే మీ నాన్న ఎంత రాస్కెలో తెలుస్తుంది’ అని కూడా చెప్పా. అయినా సరే రాయమంది. నా వెుదటి శృంగారానుభవంతో సహా అన్నీ రాశాను’ అని చెబుతారు కుష్వంత్. ఇందులో తప్పొప్పులు, నైతిక వర్తనతో నిమిత్తం లేదు. మనిషిని మనిషిగా అర్థంచేసుకోవడమే. అంతే! అంతకుమించిన ప్రయోజనం ఆత్మకథకు లేదా అంటే… ఉంది. మనిషి జీవితం సామాజికమైందని గుర్తించడంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైతే, జీవితం వ్యక్తిగతమైందని గ్రహించడంలో మార్క్సిజం విఫలమైందంటారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. జీవితమంటే వ్యక్తిగతమూ సామాజికమూ కూడా. సంఘానికి మనం కనిపించే తీరు వేరే. మనకు మనంగా వేరే. మన గురించిన కొన్ని నిజానిజాలు మనకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. మనసు లోతుల్లోని భావ సంచలనాన్ని ఎవరు పసిగట్టగలరు?
గాంధీజీ చేసిందదే
ప్రపంచంలో మహాత్ముడి స్థానం ఎంత ప్రశస్తమైందో, ఆత్మకథల్లో ఆయన ‘సత్యశోధన’ అంత విశిష్టమైంది. ‘ప్రతిరోజు రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా, నా మనస్సు మాత్రం పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి దృష్ట్యా స్త్రీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనస్థితి యిలా వుండేది. వదిలిపెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మాతండ్రి గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్లేవాణ్ణి’… తండ్రి ఆఖరు ఘడియల్లో ఉన్నా తాను శారీరకవాంఛతో దహించుకుపోయిన వైనాన్ని కూడా బాపూ రాశారు. ఇంతటి నిజాయతీ ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా ప్రజలతో మమేకమైన నాయకుడు తన బలహీనతలను వెల్లడించడం సాహసమే. అబద్ధం చెప్పిందీ దొంగతనం చేసిందీ సిగరెట్ కాల్చిందీ మాంసం భుజించిందీ… ఏదీ దాచుకోలేదు. ‘ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం’ అంటారు గాంధీజీ. ఆత్మదర్శనం కోసం, ఈశ్వర సాక్షాత్కారం కోసం, వోక్షం కోసం తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నారు బాపూ. తనను తాను అగ్గితో కడుక్కున్నారు, సత్యంతో పునీతమయ్యారు. అందుకే ఆ పుస్తకం పాఠకులను కదిలించింది. ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.
చలం ఆత్మకథ కూడా అంతే. ఆయన రచనలంత స్వచ్ఛంగా ఉంటుంది. దాని పేరు కూడా ‘చలం’. ‘ఆత్మ కథలంటే నాకసహ్యం. ఆత్మకథ రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికేదో నష్టమైనట్టు అనుకొంటున్నా డన్నమాట రాసినవాడు….. ఐనా ఆ పని జరుగుతుందంటే, ఏదీ మన చేతుల్లో లేదన్నమాట’ అని చలం వృద్ధాప్యంలో తనను రాయమని బలవంతపెట్టినవారిని ‘విసుక్కుంటాడు’. ఎలా జరిగినా ఆయన మనసు లోతుల్ని హృద్యంగా చిత్రించాడు. ‘చలంగారి గుణాల్లో నా మీద గాఢంగా ముద్రవేసింది ఆయన నిజాయితీ. గాంధీగారి తర్వాత అంత నిజాయితీపరుణ్ణి ఈయన్నే చూశాను. ఏది ప్రవచిస్తాడో అదే ఆచరిస్తాడు. గాంధీగారికి ఈయనకూ ఇంకా పోలికలున్నాయి. ఇద్దరూ సత్యాన్వేషకులు. వీళ్లు అనుష్ఠించిన సత్యాలు ఒకటి కాకపోయినా వాటి మూల తత్త్వంలో సామ్యం వుంది. ఇవి హృదయగత సత్యాలు’ అంటారు కవి ఇస్మాయిల్.
పశ్చాత్తాపంతో…
నిజాయతీగా, ఉన్నదున్నట్టు రాయాలంటే ఏవీ అడ్డు ఉండకూడదు. ఎవరినో మంచి చేసుకోవాలన్న తాపత్రయం ఉండకూడదు. కపిల్‌దేవ్ మాటల్లో చెప్పాలంటే క్రికెట్‌బోర్డు గురించి విమర్శలు చేయడానికి వెనకాడకూడదంటే, జట్టులో చోటు దక్కదేవో అన్న భయం ఉండకూడదు. ‘నాకు దాయడానికి ఏమీ లేదు. నాకు బాధలేవీ లేవు. నా జీవితం, కుటుంబం, నా స్నేహితులు, జట్టుసభ్యులు, క్రికెట్ బోర్డు, మీడియా అన్నింటిగురించి అందరిగురించి చెప్పగలిగిందంతా చెప్పేశాను’ అన్నారు కపిల్ 2004లో తన ఆత్మకథను విడుదల చేస్తూ.
అయితే, తప్పనిసరై ఉద్యోగంలో కొనసాగి, ఆ తర్వాత నిజం గుండెల్ని పిండేసి, నిద్ర కరవై, తమను తాము పునీతం చేసుకోవడానికో హృదయభారం తగ్గించుకోవడానికో రాసే ఆత్మకథలూ ఉంటాయి. జాన్ పెర్కిన్స్ ‘ఓ దళారీ పశ్చాత్తాపం’ (కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్) దీనికో ఉదాహరణ. అమెరికా దుష్కృత్యాలకు ఈయన ప్రత్యక్ష కర్త. సీఐఏ తోడేళ్లు(రచయిత వర్ణించిన పదమే) పేద, అభివృద్ధి చెందిన దేశాలను ఎలా పీక్కుతినేవారో, తమకు గిట్టనివాళ్లు ఓ దేశ అత్యున్నతస్థానంలో ఉంటే వాళ్లను పీఠం మీదినుంచి దించేయడానికి ఎలాంటి కుట్రలు పన్నేవారో నిర్భయంగా బయటపెట్టిన ఈ పుస్తకం వామపక్ష మేధావులకు బాగా దగ్గరైంది. ఎన్నో భాషల్లోకీ అనువాదమైంది.
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా కూడా ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ స్వదేశీ రిఫార్మర్’ పేరిట ఆర్థికమంత్రిగా తన జీవితాన్ని అక్షరీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ముఖ్యమంత్రి గురించి ఓ కార్పొరేట్ కంపెనీ పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ ‘కన్ఫెషన్స్’ పేరుమీద ఆత్మకథలు చాలానే ఉన్నాయి. అందులో సుప్రసిద్ధమైంది రూసో పుస్తకం. తన ‘పాపాలను’ అందులో బహిర్గతం చేసుకున్నారాయన. ఇదే పేరుతో అల్జీరియాలో జన్మించిన సెయింట్ అగస్టీన్ ఆత్మకథ కూడా జగద్విఖ్యాతం. క్రీ.శ.397-398 మధ్యకాలంలో రాసిన ఈ పుస్తకం తొలి ఆత్మకథగా వెలుగొందుతోంది. బిషప్‌గా మారడానికి ముందు అగస్టీన్ ‘పాపపంకిల జీవితం’ ఇందులో వస్తువు.
నిజాయతీ చాలా?
‘మనం జీర్ణించుకోలేని వాస్తవం ఏదో ఒకటి ఉంటేనే ఆ ఆత్మకథ నిజమని మనం నవ్మెుచ్చు. అంతా బానే ఉన్నట్టుగా ఎవరైనా తమ జీవితాన్ని గురించి వర్ణిస్తే వారు అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. జీవితాన్ని తరచి చూస్తే వరుస వైఫల్యాలే కనిపిస్తాయి’ అని తేల్చేస్తారు ‘యానిమల్ ఫార్మ్’ రచయిత జార్జ్ ఆర్వెల్. జీవితంలోని చేదుకే ఎక్కువ తూకం వేసిన రచయితగా ఆర్వెల్ నిజాయతీకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఫలానా వ్యక్తి ఉన్నదున్నట్టు రాశాడని మనం అనుకోవడమే తప్ప, అందులో వాస్తవమెంతో ఆ వ్యక్తికీ లేదూ ఆ సంఘటనలతో సంబంధమున్న వాళ్లకీ మాత్రమే తెలిసే అవకాశముంది. కానీ ఇదొక్కటే చాలా? కేవలం సంకోచాలు లేకుండా రాస్తేనే సరిపోతుందా? కానే కాదు, విషయంలో వాస్తవం ఉండడంతోపాటు, అది పాఠకుడికి కొత్త దృష్టిని ఇవ్వగలగాలి. అంతకుముందు కన్పించని కొత్త కోణాన్ని చూపగలగాలి… బాల్యంలోని మాధుర్యాన్ని టెట్సుకో కురొయనాగి రుచి చూపించినట్టు.
తొలిసారి అమ్మతో రైలెక్కింది టొటొచాన్(రచయిత్రే). రైలు టిక్కెట్టు చాలా విలువైందిగా తలపోసింది. గట్టిగా పట్టుకుంది. టికెట్ కలెక్టర్ దగ్గరి పెట్టెనిండా ఉన్న టికెట్లను చూస్తూ, ‘అవన్నీ మీవేనా?’ అనడుగుతుంది. ‘కాదు, అవన్నీ రైల్వేవాళ్లవి’ అంటాడాయన. ‘ఒహ్- పెద్ద పెరిగాక నేను రైలు టికెట్లమ్మే పనిచేస్తాను’ అనుకుంటుంది. అదే విషయం అమ్మతో చెబుతుంది. ‘నువు గూఢచారివవుతావని అనుకుంటున్నానే ఇన్నాళ్ళూ’ అంటుంది అమ్మ. అంతకుముందు రోజు వరకూ తనూ అలాగే అనుకున్నట్టు గుర్తొస్తుంది. ఆలోచనలో పడుతుంది. ‘కాని పెట్టెనిండా టిక్కెట్లు తన దగ్గరే ఉండడం ఎంత సరదాగా, ఎంత బాగుంటుంది!’ దాంతో మధ్యేమార్గంగా ‘ఆఁ! అట్లా చేయెుచ్చుగా. నిజంగానేవో గూఢచారి. పైకేవో టికెట్లమ్మే మనిషి’ అంటుంది టొటొ.
రెండో ప్రపంచయుద్ధానికి ముందు జపాన్‌లో ఓ కొత్త విద్యావిధానానికి రూపకల్పన చేసిన కొబయాషీ మాస్టారు బడి ‘టోవో’లో చేరడానికి ముందూ తర్వాతా తన చిన్ననాటి జీవితాన్ని ఆవిష్కరించారు కురొయనాగి. ఇలాంటి చిన్నారి మన బిడ్డే అయితే ఎంత బాగుంటుందన్నంత దగ్గరైపోతుంది టొటొ. బాల్యాన్ని ఇంత నిశితంగా, చిన్న చిన్న ఘటనలను కూడా విడిచిపెట్టకుండా వర్ణించిన ఈ పాక్షిక ఆత్మకథ పిల్లల మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఎన్నో భాషల్లోకి అనువాదమైన ఈ పుస్తకం తెలుగులో ‘రైలుబడి’గా వచ్చింది.
పాక్షిక ఆత్మకథ అంటే, రాహుల్ సాంకృత్యాయన్ ‘లోకసంచారి’ గురించి చెప్పుకోవాలి. తనకు ఇల్లొదిలి పారిపోవాలని ఏ వయసులో అనిపించిందో వెుదలుపెట్టి, సంచారజీవితంలోని గొప్పతనాన్ని ఆ మహాపండితుడు ఎలా వర్ణిస్తాడంటే, ఇంట్లోంచి ఎప్పుడు బయటపడదామా… అన్నంత ఉత్తేజం కలుగుతుంది.
పరమార్థం ఏమిటి?
ఓ మనిషిని చదువుతుంటే అప్పటి సామాజిక పరిస్థితులు కళ్లకు కట్టాలి. తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆత్మకథ భారత స్వాతంత్య్రోద్యమానికి అద్దం పడుతుంది. ‘మనలో చాలా మందిమి ఆ (స్వాతంత్య్ర)పోరాటం వల్ల ప్రభావితులమయ్యాం. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి ఆ పోరాటమూ అప్పుడు మనల్ని నడిపించిన ఆదర్శాలూ లక్ష్యాలే కారణం. ఇప్పుడది గత చరిత్రే కావొచ్చు. కానీ కొన్నిసార్లు వర్తమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, చరిత్రను తెలుసుకోవడం చాలా ఉపయోగం. ఆత్మకథ అంటే వ్యక్తిగత డాక్యుమెంట్ కాబట్టి, వ్యక్తిగత అభిప్రాయాలూ, స్పందనలూ ఉంటాయి. అయితే ఓ గొప్ప పోరాటంలో, చెప్పుకోదగిన స్థాయిలో పాలు పంచుకున్న వ్యక్తి రాసినప్పుడు ఎంతోమంది భావాలు అందులో ప్రతిబింబిస్తాయి’ అంటారు నెహ్రూ తన ‘యాన్ ఆటోబయోగ్రఫీ’ ముందుమాటలో. ఓ రకంగా భారతప్రజల గుండె చప్పుడును నెహ్రూ వినిపించారు.
పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ‘విప్లవపథంలో నా పయనం’ చదవడమంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అర్థం చేసుకోవడమే. ‘తెలంగాణా పోరాట నిర్వహణ అంటే చాలా అంశాలుంటాయి. ఆయుధాలు కొనాలి! మందుగుండు కావాలి! మందులు కావాలి! వాటిని జేర్చవలసిన చోటుకు జేర్చాలి! దళాలు, నిర్మాణము, వాటి కదలిక అవన్నీ క్రమబద్ధంగా వుండాలి! ఈ దళాలే వారి అవసరాలన్నింటినీ వోసుకు వెళ్ళాలి!’ అని రాశారు సుందరయ్య. ‘స్వతంత్ర భారతదేశంలో విలీనానికి నైజాం అంగీకరించడం లేదు. భారత సైన్యం జాోక్యం చేసుకుని, నిజాం రాజరికాన్ని తోసివేసి, భారతదేశంలో నైజాం సంస్థానాన్ని కలిపివెయ్యాలి అని మేము డిమాండు చేస్తున్నాము. నిజాం నిరంకుశత్వం అంతం కావాలి’ అని అప్పటి ప్రజానీకం స్పందనలను తమవిగా చేసుకున్న కమ్యూనిస్టుల ఎజెండాను ఆవిష్కరిస్తారు.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (లాంగ్ వాక్ టు ఫ్రీడమ్), స్వతంత్ర అమెరికా నిర్మాతల్లో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్(ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్) ఆత్మకథలు కూడా ఈ తరహావే. ఇక చార్లీచాప్లిన్, అకిరా కురసావా, ఇంగ్‌మార్ బెర్గ్‌మాన్ ఆత్మకథలు వాళ్ల జీవితంలోని పార్శ్వాలతోపాటు సినిమాకు సంబంధించిన లోతుల్ని పరిచయం చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలోని సంశయాలను పరమహంస యోగానంద(ఒక యోగి ఆత్మకథ) తీరిస్తే, మనసుపొరల్లోని సంచలనాలను హెలెన్ కెల్లెర్(ద స్టోరీ ఆఫ్ మై లైఫ్) చిత్రిక పడుతుంది.
ఉత్తుంగ తరంగమై ఎగసిన రోజా పార్క్స్ జీవితం అమెరికాలోని నల్లవారి దుర్భర పరిస్థితులను ఆవిష్కరిస్తుంది. అసలు దుఃఖంలోంచి అణచివేతలోంచి అద్భుత సాహిత్యం పుడుతుందనడానికి అమెరికన్ ఆఫ్రికన్ల జీవితాలే నిదర్శనం. బానిసత్వం మీద ఎంత గొప్ప నవలలు వచ్చాయో అంతే గొప్ప ఆత్మకథలు కూడా వెలువడ్డాయి. బుకర్ టి.వాషింగ్టన్ రాసిన ‘అప్ ఫ్రమ్ స్లేవరీ’ ఇలా ప్రారంభమవుతుంది. ‘నేను వర్జీనియాలోని ఫ్రాంక్లిన్ భూస్వామ్య క్షేత్రంలో బానిసగా జన్మించాను. నిజానికి, నా జననానికి సంబంధించిన కచ్చితమైన తేదీకానీ ఫలానా చోటే పుట్టినట్టుగానీ నాకేమీ తెలియదు, కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఓ సమయానికి పుట్టే ఉంటాను….’ 1901లో ప్రచురించిన ఈ పుస్తకం కోట్లాది ప్రజలను కదిలించివేసింది. అమెరికా అధ్యక్షుడితో వైట్‌హౌస్‌కు రావాలని ఆహ్వానం పొందిన తొలి నల్లజాతీయుడు వాషింగ్టన్. ఇంకా హారియట్ ఆన్ జాకబ్స్(ఇన్సిడెంట్స్ ఇన ద లైఫ్ ఆఫ్ ఎ స్లేవ్ గర్ల్), ఫ్రెడెరిక్ డగ్లస్(లైఫ్ ఆఫ్ ఫ్రెడెరిక్ డగ్లస్, యాన్ అమెరికన్ స్లేవ్), రిచర్డ్ రైట్ (బ్లాక్ బాయ్) ఆత్మకథలు కూడా సుప్రసిద్ధమైనవే.
రెండో ప్రపంచయుద్ధ సమయంలో తమ దేశాన్ని జర్మనీ దురాక్రమించినప్పుడు, కుటుంబంతో సహా రహస్యజీవితం గడిపిన నెదర్లాండ్స్ యూదు బాలిక అన్నే ఫ్రాంక్ ఆ రెండేళ్ల కాలంలో రాసిన డైరీలను ఆత్మకథా కోవలోనే విడుదల చేశారు(ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్). బానిసల వెతలు, నాజీల దురాగతాలు చదివితే, ‘కొన్ని అవశేషాలను కొనసాగిస్తున్నప్పటికీ మానవసమాజం ఎన్ని రకాలుగా ప్రక్షాళనకు గురైందో కదా’ అనిపించడం ఖాయం.
ఇప్పుడా శక్తి ఉందా?
ఓ స్థాయికి చేరిన ప్రతి వ్యక్తీ ఆత్మకథ రాయడానికి సంకల్పించడం సహజం. అవి ఎందరికో మార్గదర్శకం అయ్యాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తనకు గాంధీజీ జీవితం సరైన పంథా నిర్ణయించుకునే దృక్పథాన్ని అందించిందని పేర్కొంటే, టాల్‌స్టాయ్ రచనలు తనకు స్ఫూర్తినిచ్చాయని మహాత్ముడు చెప్పుకున్నారు. అక్షరాలకు అంత శక్తి ఉంది. ‘నేను…’ అంటూ ఉత్తమపురుషలో వెుదలయ్యే ఆత్మకథల్లో పాఠకుడిని తనతో పాటు వెంట తీసుకెళ్లగలిగే ఇంద్రజాలముంది. అయితే, తప్పుదోవ పట్టించడానికో, అప్పటికి వారిమీద ఉన్న విమర్శలు రూపుమాపుకోవడానికో, సానుభూతి పొందడానికో రాసుకునే ఆత్మకథలూ ఇప్పుడు వస్తున్నాయి. ఆదరణను సొమ్ము చేసుకోవడానికో సంచలనం సృష్టించడానికో విడుదలచేసేవీ బోలెడు. ఇలాంటివి ఎక్కువగా సెలబ్రిటీలవే అయి ఉంటాయి. ఈ ధోరణి మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ. కొద్దోగొప్పో పేరున్న నటీనటులు, వోడల్స్ తదితరులు తమ ఆత్మకథలు విడుదల చేసుకోవడం కద్దు. ‘వారు సత్యాలు దాచారంటే వీరు అసత్యాలు రాశా’రంటూ వాదోపవాదాలు జరిగిన పుస్తకాలూ ఉన్నాయి. ఏదేమైనా, కోకొల్లలుగా విడుదలయ్యే ఆత్మకథలకు ఇదో చేర్పు మాత్రమేనా… దీనికీ ప్రత్యేక అస్తిత్వం ఉందా… అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అందుకే, ఆత్మకథలు రెండు రకాలు. చిరకీర్తిని మూటగట్టుకునేవి, అచిరకాలంలోనే కాలగర్భంలో కలిసిపోయేవి. ఇందులో ఏ రకమైనా ఆత్మకథ అక్షరమక్షరం విందుభోజనమే, పాఠకుల ఆదరణకు పాత్రమే. అవును మరి… చదివించే గుణం జీవితంలోనే ఉంది!
——————————————————————————–
తెలుగు ఆత్మకథా వైభవం
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, ‘స్వీయచరిత్రము’ వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. ‘ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును’ అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను ‘స్వీయచరిత్రము’ పేరుతో రాశారు.
పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య ‘నేనూ నా దేశం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య ‘జీవనయానం’, కాళోజీ నారాయణరావు ‘నా గొడవ’ పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి ‘నా జీవనపథంలో’ స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు ‘తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు’ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్.రాజలింగం ‘స్వీయచరిత్రము’, ‘బాపు-నేను’ పుస్తకాలు రాశారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాకా’, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అనుభవాలు జ్ఞాపకాలు’ గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన ‘అనంతం’ వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. ‘ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు… ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను’ అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ ‘విన్నంత కన్నంత’ రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ‘నా జీవితయాత్ర’, రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ‘నా జీవిత కథ’, రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్ రాంభట్ల కృష్ణమూర్తి ‘సొంత కథ’, రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్ ‘బతికిన క్షణాలు’ పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.
‘ఆత్మచరితము’ వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి ‘నాలో నేను’ అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. ‘…నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!… అందువల్ల… అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను’ అన్నారు నరసరాజు.
——————————————————————————–
ఆత్మకథే దేశచరిత్ర
ఓ మనిషి తన గురించి తాను రాసుకుంటే… అది దేశ చరిత్ర అవడం తెలుసా? ఫిన్‌లాండ్ రచయిత ‘కల్లేపాటలో’కు ఆ ఘనత దక్కుతుంది. ప్రపంచంలో సుదీర్ఘ ఆత్మకథా రచయితగా పాటలో కీర్తిని ఆర్జించాడు. పదిహేడు వేల పేజీల్లో ఇరవై ఆరు సంపుటాలుగా ఆయన తన జీవితాన్ని అక్షరబద్ధం చేసుకున్నాడు. దీనికి ఆయన వెచ్చించిన కాలం… అక్షరాలా ఇరవై ఏడేళ్లు. ఆయన పుస్తకాలన్నీ ఫిన్నిష్ భాషలోనే రాశాడు. తొలుత చిన్న కథలు రాయడం వెుదలుపెట్టిన పాటలో తన 39వ ఏట తొలి నవల పూర్తిచేశాడు. తనకు చిరపరిచితమైన భవననిర్మాణ కూలీల జీవితాలను అందులో చిత్రించాడు. రెండో నవల్లో ఆ దేశ ఆర్థికమాంద్యాన్నీ ఆ కాలంలో ఎదుర్కొన్న కష్టాలనూ రాశాడు. మరో కొన్ని పుస్తకాల తర్వాతే పూర్తిస్థాయిలో తన ఆత్మకథా సిరీస్ ‘ఇజొకి’ (నది) రాయడం వెుదలుపెట్టాడు. 1971 నుంచి 98 వరకు ఏడాదికో పుస్తకం రాస్తూ పోయాడు. చివరిది పూర్తిచేసిన రెండేళ్లకు ఆయన చనిపోయాడు.
——————————————————————————–
జీవితం ఓ కథగా…
పూర్తిగా ఆత్మకథ వెలువరించకుండా తమ జీవితాన్ని కథలోకి ఇమిడ్చి రాయడం ఓ పద్ధతి. లేదంటే తమనే ఓ పాత్రగా మలుచుకోవడం మరో విధానం. ఇలాంటి ‘ఆత్మకథా నవలలు’ ఎన్నో ఉన్నాయి. ‘డేవిడ్ కాపర్‌ఫీల్డ్’లో డేవిడ్ ఎదుర్కొన్న బాల్యం చార్లెస్ డికెన్స్‌దే అంటారు. ‘అన్నా కరెనినా’ కథానాయకుడు లేవిన్ ఆలోచనలు, మనస్తత్వం లియో టాల్‌స్టాయ్‌ను ప్రతిబింబిస్తాయని చెబుతారు. ఆయనే చైల్డ్‌హుడ్, బాయ్‌హుడ్, యూత్ పేరిట మూడు ఆత్మకథా నవలలు రాసుకున్నారు. ‘ప్రజల మనిషి’లోని తెలంగాణ యోధుడు కంఠీరవం పాత్ర వట్టికోట ఆళ్వారుస్వామికి దగ్గరగా ఉంటుందంటారు. ‘లోపలిమనిషి’లోని ఆనంద్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావే అనిపించక మానడు. ‘సాధారణ గ్రామీణుడిగా ప్రారంభించి ప్రధానమంత్రిగా సాగిన దీర్ఘప్రయాణం- ఎక్కడా వేడుకంటూ లేని లక్ష్యోన్ముఖ ప్రయాణం- సాగించాడు’. ఇదీ పుస్తక సారాంశం. వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ గగుర్పొడిచే వాస్తవాలుంటాయందులో.
‘టు లైవ్స్’లో విక్రమ్ సేఠ్ రాసిన రెండు జీవితాలు తన అంకుల్, ఆంటీలవే. ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’లో కొంతవరకు వ్యక్తమైంది అరుంధతీరాయ్ తల్లి జీవితమే. ‘ఖాకీ బతుకులు’ పుస్తకంలో హీరో ప్రకాశం… రచయిత స్పార్టకస్ తండ్రే. ‘చదువు’లో వర్ణించిన నాయకుడు సుందరం పాత్ర కొడవటిగంటి కుటుంబరావుకు దగ్గరగా ఉంటుందని విమర్శకుల వాదన. దాన్ని కొ.కు.మాత్రం అంగీకరించలేదు. ‘…ఆత్మకథ నవలా అంటే అదీ కాదన్నారు (కొ.కు.). కానీ ఆత్మకథా నవల ఛాయలు తగుమాత్రం పొడగడతాయి’ అంటారు ‘నూరేళ్ల తెలుగు నవల’లో ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ సహవాసి. ఆయనే ‘అసమర్థుని జీవయాత్ర’ గోపీచంద్ మానసికస్థితికి దగ్గరగా ఉందని విశ్లేషిస్తారు. ‘హేతువాద దృక్పథానికీ చనిపోయిన తన తండ్రి పట్ల తనకు గల అభిమానానికీ అవినాభావ సంబంధం ఏర్పడి ఉండటం, ఆ రెంటి కలయిక తన వ్యక్తిత్వంపై వోపిన భారాన్ని దించుకోలేకపోవడం సీతారామారావు అసమర్థతకి మూలం. అదే అతని విషాదాంత గాథ వెనకాల దాగి వున్న మనస్తత్వ రహస్యం’ అని వెల్లడిస్తారు. ఆ నవల రాయటం ద్వారా తనలోని సీతారామారావు మరణించటం ద్వారా గోపీచంద్ మానసికంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, జీవితం పట్ల కొత్త దృక్పథం ఏర్పరచుకుంటాడంటారు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి హేతువాది అన్నది తెలిసిందే. దాన్నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గం పట్టారు గోపీచంద్. ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’లో అరవిందుల తత్వం గురించి అంతగా విడమరిచి రాయడానికి గూడా అదే కారణం.
——————————————————————————–
ఒక మనిషి… ఎన్నో చరిత్రలు
పిండి కొద్దీ రొట్టె… పేరు కొద్దీ జీవిత చరిత్రలు అనుకోవచ్చు. మహాత్మాగాంధీ మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నెహ్రూ కుటుంబం మీదా అంతే. వాళ్లకున్న పేరుప్రతిష్ఠలను బట్టి ఎందరో ఎన్నో కోణాల్లో వారి జీవిత చరిత్రలు వెలువరిస్తూనే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్‌సింగ్, చే గువేరా, స్టాలిన్, మ్యాక్స్ ముల్లర్, అబ్రహామ్ లింకన్, జేమ్స్ జాయిస్, ఆస్కార్ వైల్డ్, విన్‌స్టన్ చర్చిల్ లాంటి ప్రముఖుల మీద కూడా ఎన్నో మంచి పుస్తకాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మీద ‘ఒకే ఒక్కడు’, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మీద ‘ప్రజలమనిషి’ విడుదలయ్యాయి.
ఇవి నాయకులకే పరిమితం కాదు. సినీతారలు, క్రీడాకారుల మీదా అదే సంఖ్యలో పుస్తకాలు వస్తుంటాయి. అక్కినేని నాగేశ్వర్రావు, భానుమతి, చిరంజీవి, మహేశ్‌బాబుల మీద కూడా జీవిత చరిత్రలు వెలువడ్డాయి. మహానటి సావిత్రి మీద చాలా పుస్తకాలే వచ్చాయి. బహుశా ఆమె విషాదాంత జీవితం ఎక్కువమందిని కదిలించి ఉండొచ్చు.
నర్గీస్, అమితాబ్‌బచ్చన్, షారుక్‌ఖాన్, హెలెన్, అమీర్‌ఖాన్, రాహుల్‌ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జాల మీద కూడా పోటీపడి పుస్తకాలు రాశారు. ఇందులో కొన్ని సదరు ప్రముఖులను కలిసి, చర్చించి రాసేవైతే కొన్ని రచయితలే సొంతంగా రాసేవీ ఉంటాయి. ఎవరి జీవితచరిత్రను వాళ్లయినా చదువుకున్నారో లేదో అని ఓ జోక్ కూడా ఉంది. అభిమానంతో కొందరు రాస్తే, సొమ్ము చేసుకోవడానికి మరికొందరు రాస్తుంటారు. అందులోని సంచలన రాతలకు కోర్టులదాకా వెళ్లినవారు కూడా ఉన్నారు(ఉదా: క్యాథెరీన్ జెటా జోన్స్). అందుకే సదరు ప్రముఖుల సంపూర్ణాంగీకారంతో వెలువడినప్పుడు ‘అధికారిక’ జీవిత చరిత్ర అని వాడుతుంటారు. ఇంతకుముందు హేమమాలిని మీద కొన్ని పుస్తకాలు వచ్చినా ఇటీవలే ‘హేమమాలిని: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ’ విడుదలైంది.
——————————————————————————–
రాసిపెడతాం
స్పూర్తిమంతమైన జీవితం గడిపినవారందరూ ఆత్మకథలు రాసుకోవాలనేం లేదు. ఫిడెల్ క్యాస్ట్రో ఆత్మకథను నోర్బెటో ఫ్యూంటెస్ రాశాడు. మాల్కం ఎక్స్ ఆత్మకథను ‘ఏడుతరాలు’ రచయిత అలెక్స్ హేలీ వెలువరించాడు. రాసేంత సమయం ఉండకపోయినా స్వయంగా రాయాలన్నంత ఆసక్తి లేకపోయినా మరో రచయితో సహచరుడో ఆ పనికి పూనుకుంటారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’(ఒక విజేత ఆత్మకథ) ఈ కోవలోకి వస్తుంది. దీని రచయిత అరుణ్ తివారీ. ఇలాంటి పుస్తకాలకు ‘…తో కలిసి’ అని తమ పేరు వేసుకుంటారు. పారిశ్రామికవేత్త కిశోర్ బియానీ ఆత్మకథ ‘ఇట్ హాపెన్డ్ ఇన్ ఇండియా’కు సహ రచయిత దీపాయాన్ వైశ్య. ఇది పేర్లు వెల్లడించేవారి సంగతి.
కొన్ని ఆత్మకథల్లో ఘోస్ట్ రైటర్సే ఆ పని చేసిపెడతారు. అమెరికా సెనేటర్ హిల్లరీ క్లింటన్ తన ఆత్మకథ ‘లివింగ్ హిస్టరీ’ రాయడానికి ముగ్గురు రచయితల సహకారం తీసుకున్నారట. పేరు క్రెడిట్ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. అలాగే హాలీవుడ్ తారల్లిో ఎలిజబెత్ టేలర్, స్టాలోన్, మడోనా, డ్రూ బారీవోర్ తదితరులందరూ తమ ఆత్మకథలను వెల్లడించుకున్నవారే. ఇందులో ఎందరు తామే సొంతంగా రాసుకున్నారనేది చెప్పలేం. సూపర్‌వోడల్ జోర్డాన్ అప్పుడే రెండు భాగాల ఆత్మకథ వెలువరించింది. ఈమె పేరు మీద (రాసింది వేరేవాళ్లయినా) రెండు నవలలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. జనాల్లో ఉన్న క్రేజును సొమ్ము చేసుకోవడానికి ప్రచురణసంస్థలు వేసే ఎత్తుగడలుగా కూడా వీటిని అర్థం చేసుకోవచ్చు. ‘ప్రతీ పేజీ నేనే సొంతంగా కాగితం మీద రాసుకున్నాను. కంప్యూటర్ కూడా వాడలేదు’ అని దేవానంద్ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, సొంతంగా రాయకపోవడం కూడా ఆచరణలో ఉందనే అర్థం ధ్వనిస్తోంది.
(ఈనాడు ఆదివారం అనుబంధం నుండి)

2 comments
Comments feed for this article
డిసెంబరు 30, 2007 వద్ద 6:07 పూర్వాహ్నం
telugucinemaguru
Chala bagundi enno vishayalu telisayi miku dhanyavadhalu
ఏప్రియల్ 15, 2008 వద్ద 1:44 అపరాహ్నం
ram
you have wonderful word power.