
ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో అమెరికా ప్రపంచాధిపత్యానికి తెరపడుతుందని, అమెరికానంతర ప్రపంచానికి నాయకత్వం వహించగలిగే అవకాశం వున్న దేశాలు ఇండియా, చైనాలేనని ఈరోజుల్లో తరచు వినిపించే వాదం. పదేళ్ల క్రితం ఇండియాకి ఇవాల్టి ఇండియాకి పోలికే లేదు. రోడ్ల నిండా హోండా, టయోటా కార్లు, షాపింగ్ మాల్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, కొత్త కొత్త వ్యాపార అవకాశాలు, లక్షల్లో జీతాలూ, రెండంకెలకి దగ్గరలో దేశ వృద్ధి రేటు, ఇలాంటి విషయాలు విన్నప్పుడు, ఓహో, ఇంత తక్కువకాలంలో ఎంత ‘అభివృద్ధి’ అని భ్రమ కలుగుతుంది.
ఆ వెలుగులో కళ్లు బైర్లు కమ్ముకోకుండా నిలబడి, దాని వెనక వున్న అసౌకర్యమైన చీకటిని గుర్తించడానికీ, ఆ చీకట్లో వుండే మనుషుల జీవితాలపట్ల సానుభూతితో కథలు రాయడానికి చాలా నిజాయితి, ధైర్యం వుండాలి. అవన్నీ వున్న రచన అరవింద్ అడిగ నవల వైట్ టైగర్. ఇది అరవింద్ మొదటి నవల. అద్భుతమైన శైలి, ఆసక్తికరంగా సాగే కథనం, గొప్ప వస్తువు వున్న ఈ నవలకి 2008 మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. కథ విషయానికి వస్తే, గయ దగ్గర లక్ష్మణ్ గార్హ్ అనే కుగ్రామంలో రిక్షాకార్మికుడి కొడుకు బలరాం ఇందులో ప్రధాన పాత్ర. తల్లి అతని చిన్నతనంలోనే మరణిస్తుంది.
ఇంట్లో ముసలావిడ బలరాంని బడి మానిపించమని ఒత్తిడి తెచ్చినా, తాను బతికున్నంతవరకూ బలరాం చదువుకునేలా చూస్తాడు తండ్రి, అతని ఒకేఒక కోరిక బలరాం అయినా చదువుకుని బాగా బతకాలన్నదే. చాలా పిరికివాడైనా, బడిలో మిగతా పిల్లలకన్నా తెలివైనవాడు బలరాం. అయినా తండ్రి చనిపోయిన తరువాత కుటుంబ ప్రతికూలతవల్ల అన్నలాగే టీ కొట్లో పనికి చేరి, తరవాత డ్రైవింగ్ నేర్చుకుని వాళ్ల గ్రామంలోనుంచి నక్సలైట్ల భయంతో టౌనుకు తరలివెళ్లిన భూస్వామి కొడుకుల దగ్గర డ్రైవరుగా-నౌకరుగా కుదురుతాడు.
గ్రామాలు వదిలివెళ్లిన భూస్వాములు టౌన్‌లో ఈ అభివృద్ధి ఫలితాలు అనుభవిస్తూ బొగ్గు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తూ వుంటారు. ఆ వ్యాపారాల్లో వచ్చిన అక్రమ ఆర్జనలని కాపాడుకోవడానికి వాళ్లకి స్థానికంగా కిందతరగతులనుంచి ఎదిగిన లుంపెన్ ‘సోషలిస్టు’ నాయకుల సహాయం వుంటుంది. ఆ భూస్వామి రెండో కొడుకు అశోక్ అమెరికాలో చదువుకుని, అక్కడే తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింకీ మేడమ్’ అనే క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని ఇండియాకి వస్తాడు. ఆయనకోసం కొన్న కొత్త హోండా సిటీ కారుకి రామ్‌ప్రసాద్ అనే పాత డ్రైవరు వుంటాడు. బలరాం అక్కడ రెండో డ్రైవరుగా చేరుతాడు. రాజకీయ అవసరాలకోసం అశోక్ ఢిల్లీ వెళ్లేటప్పుడు, బలరాం రామ్ ప్రసాద్‌ని బ్లాక్ మెయిల్ చేసి అతని బదులు ఢిల్లీకి చేరుతాడు.
అక్కడ ఒకరోజు పింకీ మేడమ్ తప్పతాగి రోడ్డుమీద వున్న ఒక పేదపిల్లమీద కారు ఎక్కించేస్తే, ఆ నేరం తాను చేసినట్టుగా ఒప్పుకొని జైలుకు వెళ్లవలసిన ఒత్తిడులకి తలొగ్గుతాడు బలరాం. అయితే ఆ అవసరం రాదు. చాలా సాధువని, మంచివాడని భావించిన అశోక్ నిజరూపం కొంత అర్థమవుతుంది. మహానగరాల్లో డబ్బుతో కొనగలిగిన సుఖాలు తెలుస్తాయి. యజమానులకోసం ఎదురుచూసే డ్రైవర్లు కాలం గడపడంకోసం చదివే హత్యల వారపత్రికలు, ఢిల్లీలో పాత పుస్తకాల రోడ్డుమీద రూమీ, ఇక్బాల్, మిర్జాగాలీబు కవితలు పరిచయం అవుతాయి. నువ్వు ఏళ్ల తరబడి తాళం చేతులకోసం వెతుకుతున్నావు కానీ తలుపు ఎప్పుడూ తెరిచే వుంది అన్న ఉర్దూ కవి కవితతో జ్ఞానోదయం అవుతుంది.
ఒకరోజు రాజకీయనాయకుడికి లంచం యివ్వడానికి డబ్బు తీసుకెళ్తున్న అశోక్‌ని చంపి, ఆ ఏడు లక్షల డబ్బుతో బెంగుళూరు పరారీ అయ్యి అక్కడ కాల్ సెంటర్లలో పనిచేసే వాళ్లని రవాణా కాంట్రాక్ట్‌లు సంపాదించి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారతాడు. ఈ కథంతా బలరాం బెంగుళూరు వస్తున్న చైనా అధ్యక్షుడు వెన్ జియా బావ్ కి రాసిన వుత్తరం ద్వారా తెలుస్తుంది. ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆ అంతరాల వల్ల అనివార్యంగా పెరుగుతుండే నేర ప్రవృత్తి, హింస, చీకట్లలోంచి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తున్న చీకటి మనుషుల న్యాయమైన, సహజమైన ఆకాంక్ష. దానికి సరైన మార్గాలు కనబడక-సరైన ‘రోల్ మోడల్స్ కనబడక’- ఆరాటం. బానిసత్వం తప్ప ఇంకేమీ నేర్పని మతం, కుటుంబం.
మనముందే ఉన్నా మనకి కనబడని ఈ బీభత్సాన్ని అసాధారణ ప్రతిభతో- చిత్త ప్రసాద్ ఇండియన్ ఇంక్ డ్రాయింగు లాంటి చిత్రాన్ని-’అభివృద్ధి పథం’లో ఇండియా పటాన్ని ఆవిష్కరిస్తాడు అరవింద్. నవలలో ఒకచోట బలరాం అంటాడు, ‘డ్రైవర్‌లు హత్యల వారపత్రికలు చదివితే యజమానులు భయపడవలసిన అవసరం లేదు. కానీ మీ డ్రైవర్ గాంధీ, గురించో, బుద్ధుడి గురించో చదవడం మొదలు పెడితే మీరు మీ ప్యాంటులో ఉచ్చపోసుకోవాల్సిన సమయం వచ్చినట్టు’ అని. ఎంత నిజం. హత్యలూ, నేరాలూ చేసినవాళ్ళే సాధారణంగా క్షణికావేశానికి లోనైనవాళ్ళు. వాళ్ళకి కుటుంబం, సంఘం బంధనాలు ఉంటాయి. గాంధీ, బుద్ధుడూ ఆ సంకెళ్ళు విడగొట్టుకుని అనుకున్న దారిలో స్థిరనిశ్చయంతో వెళ్ళిన మనుషులు.
ఒక మనిషి వాళ్ళ జీవితాలు తెలుసుకుని ఆ ధైర్యం నేర్చుకుని, చుట్టు పక్కల సమాజంలో అలాంటి ఉన్నతమైన ఆదర్శానికి ప్రతీకలు కనబడకపోతే ఎంత విధ్వంసం సృష్టించగలిగే మృగంగా అవగలడూ? మన ‘అభివృద్ధి పథం’ అలాంటి మృగాలనీ, ఆ హింసని ఎంత నియంత్రించగలదూ? భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళందరూ తప్పకుం డా ఈ పుస్తకాన్ని చదవాలి. మరుసటిరోజు మీరు ఆఫీసుకి జ్వరమని సెలవు పెట్టాల్సి వచ్చినా బెంగపడకండి. మనం ఒకరోజు పనెగ్గొడితే ఆగేదికాదు ఈ అభివృద్ధి రథం. ఈ పుస్తకం చదివి బలరాంలు నోరు తెరిచినప్పుడు వాళ్ళని ఒక నిమిషమైనా మాట్లాడనివ్వాలనే స్పృహ మనకు కలిగితే, అదే ఎప్పుడైనా మన ప్రాణం కాపాడవచ్చు.
By - రమణ
జాక్సన్‌విల్, ఫ్లోరిడా
From: Andhrajyothy

5 comments
Comments feed for this article
నవంబరు 4, 2008 వద్ద 5:45 పూర్వాహ్నం
కె.మహేష్ కుమార్
ఈ నవల ఇప్పుడే చదవడం ముగించాను. సులభతరమైన ఆంగ్లం, కథనంలోని అమ్మాయకత్వం,కథలోని చీకటి కోణం నాకు చాలాబాగా నచ్చాయి.
నవంబరు 4, 2008 వద్ద 1:35 అపరాహ్నం
sujata
ఈ నవల నేను చదవలేదు. గానీ ఈ వారం హిందూ లిటరరీ రివ్యూ లో కొంత విమర్శ చదివాను. నిజమైన ఇండియా మీద చాలా దారుణమైన అభిప్రాయాన్ని కలిగించడానికి ఇలాంటి పుస్తకాలు పనికొస్తాయి. సిటీ ఆఫ్ జాయ్ చదివినపుడు ఎంతగా చలించిన మనసు.. ఇదే పుస్తకం ఒక పాశ్చాత్యుడు చదివితే ఎలా ఫీలవుతాడా అని భయపడింది. మాన్ బుకర్ ప్రైస్ అడిగ ని బాగా అమ్ముతుంది. అడిగ.. ఇండియాని అమ్ముతాడు – ఇదే రియల్ ఇండియా అని. రియల్ ఇండియాని దారుణంగా చూపించడం, నేరాల్ని – ఇంటి గుమ్మాల్లోకి తీసుకురావడం, చీకటి కోణాలూ ఇవే భారతీయ ముఖ చిత్రం కాదు. అంటూ.. రాసిన ఈ విమర్శని కూడా చదవండి. ముఖ్యంగా అరవింద్ అడిగా.. మాన్ బుకర్ ప్రైస్ వెబ్ సైట్ లో – ‘ఇండియా లో ఈ బుకర్ ప్రైస్ గురించి ఎవరికీ తెలియదు. నేనింకా లోకల్ ట్రైన్ లోనే తిరుగుతున్నాను. అరక్షిత మంచి నీరు తాగుతూ, ఎపుడు అనారోగ్యం పలకరిస్తుందా అని భయపడుతూనే ఉన్నాను ‘ అని రాసాట్ట. నాకెందుకో స్వదేశ్ లో షారుహ్ ఖాన్ అంతవరకూ మినరల్ వాటర్ తాగే వాడల్లా.. దేశంలో పేదరికానికి చలించి – 50 నయా పైసలకు మట్కా లో నీళ్ళు కొనుక్కుని తాగే సీన్ గుర్తొచ్చింది. మన దేశాన్ని, మన దరిద్రాన్నీ మరీ విపణిలో పెట్టేస్తున్నారు ఈ కొత్త రచయితలు ! ఈ పుస్తకం మీది విమర్శే నన్ను చాలా ఆలోచింపచేసింది. దీని కన్నా.. నాకు కిరణ్ దేశాయ్ – ఇన్ హెరి టెన్స్ ఆఫ్ లాస్ లో ఆఖరి సీన్ నచ్చింది అనుకుంటాను. కట్టు బట్టలు కూడా లేకుండా తండ్రి దగ్గరకు బిక్కు బిక్కు మన్న ప్రాణాలతో తిరిగొచ్చిన కొడుకు మన లో ఎంత ఆర్ద్రత కలిగిస్తాడు ? ఆవేశంలో నైతే నేమి ఒక జస్టిఫికేషన్ తో – యజమానిని చంపే డ్రైవర్ ఎంత కరుణను కలిగిస్తాడూ అన్నది – నిర్ణయించుకోవాల్సింది పాఠకులే. ఇది ఒక ట్రెండ్ కి చెందిన రచన కావచ్చు. బుకర్ ప్రైస్ వచ్చిందీ అంటే ఆ పుస్తకం మీద ‘మెచ్చుకోలే ‘ తప్ప ‘విమర్శ ‘ ఇంత త్వరగా అచ్చు కావడం, నాకు తెలిసి ఇదే మొదటి సారి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఓ లుక్కేయొచ్చు.
నవంబరు 4, 2008 వద్ద 6:01 అపరాహ్నం
కె.మహేష్ కుమార్
@sujata: బహుశా మీరు పుస్తకం చదివితే ఈ అభిప్రాయానికి రారనుకుంటాను. Dark humour అనేది ఒక సాహితీ/సినీ ప్రక్రియ. ఇక విమర్శలంటారా, మెచ్చుకోలుతోపాటూ అవీరాకపోతే విమర్శలకు విలువుంటుందంటారా?. బుకర్స్ ప్రైజ్ రాకముందు ఈ విమర్శకులు ఏమైపోయారో కొంచెం ఆలోచించండి!
అర్వింద్ అడిగ అరక్షిత మంచినీటిని గురించి అన్నదాంట్లో కొంత అతిశయోక్తి, ఎత్తిపొడుపూ వున్నట్లు అనిపించినా, అది ఇప్పటి నగరజీవిత నిజం కాదంటారా? మనలో ఎంతమంది హోటల్ కు వెళ్ళినప్పుడు బిస్లెరీకాకుండా, అక్కడినీళ్ళు తెప్పించుకుని తాగుతామో ఒకసారి గమనించండి. ఒకవేళ తెప్పించుకోవాలనుకున్నా, “అక్వాగార్డ్ వుందా?” అని అడిగిమరీ తెప్పించుకోమూ!
ఈ నవల narrative, as a matter of fact తరహాలో సాగుతుంది. Unapologetic గా ప్రస్తుతం భారతదేశంలో అగాధంలా వున్న, ‘భారత్’ – ఇండియాల తేడాను అంతే షాకింగ్ గా చెప్పే కథ యిది. ఇందులో కరుణకన్నా, పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందడం రచయిత ఆశించిన “రసస్పందన”. హారర్ నవలలు చదివుతూ, నీతులెలా ఆశించమో, ఈ నవలద్వారా పాఠకులు ఒక జస్టిఫికేషన్ లేక కరుణ అలా ఆశించలేము. The novel’s aim is to shock you,feel terrible about the state of affairs and still laugh at it.
నవంబరు 4, 2008 వద్ద 6:19 అపరాహ్నం
రమణ
సుజాతగారు, యిప్పుడు మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనవల్ల జరుగుతున్న విధ్వంసాన్ని అంగీకరించడం ఆ చీకటికోణాలనిగుర్తించడం వాటిని నివారించడానికి చేయవలసిన పనుల్లో మెుదటిది కాదంటారా? ఆ చీకట్లగురించి మాట్లాడేవాళ్ళతో విభేదించడానికి ఎవరికైన హక్కువుంది కానీ, వాళ్ళకి మోటివేషన్లు అంటగట్టడం భావ్యమా? – అదీ వాళ్ళ ఏం రాసారో చదవకుండానే? ఇది చదివి పాశ్చాత్యులు ఏమనుకుంటారో అని మనం భయపడవలసిన అవసరం లేదు, ఈ అభివృద్ధి నమూన వాళ్ళ నుంచి మనం తెచ్చుకున్నదే, అంతరాల వల్ల సమాజంలో ఏర్పడే నేరప్రవృత్తి వాళ్ళు చూడంది కాదు.
రమణ
నవంబరు 6, 2008 వద్ద 8:23 పూర్వాహ్నం
meeruchadivaaraa
బుకర్ ప్రైజుల మీద్ కోపం అలా వైట్ టైగర్ నవలమీద సుజాత గారితో ఆ మాట్లాడించి వుంటుంది. ఇంకా నిజానికి నవల ఆమె చదవలేదు. చదివాక బహుశా అలా అనకపోవచ్చు. ఆమె సీనియర్ పాఠకులు. ఇక హిందూలో ఆ వ్యాసం బుకర్ ప్రైజు రాకముందు రాసి తర్వాత కరెక్షన్ చేసినట్టు అనిపించింది. దానికంటే ఫ్రంట్ లైన్ లో కాస్త మంచి వ్యాసం వచ్చింది.
-రవి