ఆంధ్రజ్యోతి నుండి…
పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్ల కూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు.. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావురాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముమ్మారు నినదించింది.
పుస్తకం పట్టిన చేతులకు కృతజ్ఞతలు
పుస్తకాన్ని పట్టి ఇచ్చిన, పుస్తకాల పట్టీ ఇచ్చిన చేతులకు ధన్యవాదాలు
బుక్కులకు బుక్కైపోయిన మహనీయులు వర్ధిల్లాలి
పుస్తకాలకు లొంగిపోయిన మానవీయులకు జిందాబాద్
అనేక, అసంఖ్యాక గ్రంథాలముందు విధేయులై, వినమ్రులూ ఐ
నిలబడిన ఆ బాలగోపాలానికి హేట్సాఫ్
‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అనే పాటను కొద్దిగా మార్చి పాడుకోవాలనిపిస్తోంది.. “పిల్లలూ, దేవుడూ, పుస్తకప్రియులూ చల్లనివారే కల్లకపట మెరుగనీ కరుణామయులే” అని ఆలాపించాలనిపిస్తోంది.. 23వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నెక్లెస్ రోడ్‌కి అతి విలువైన గ్రంథ హారాన్ని ఓ పదిరోజులపాటు అద్దెకిచ్చింది. పది రోజులూ నెక్లెస్ రోడ్ మెడలో వేళ్లాడే పుస్తక హారం బరువుకి తల ఎటూ తిప్పలేక పుస్తకంలోకే తొంగిచూసింది.
ఇది నిజంగా పుస్తక తులాభారం. పుస్తకాలు సత్యభామ, రుక్మిణులై, రుక్మిణులై, పదారు వేలమంది గోపికలై వివిధ రూపాల పాఠక శ్రీకృష్ణ హృదయాన్ని అధివసించడానికి ప్రయత్నం చేసాయని అనటానికి నోరు రావటం లేదు. మనిషి పరమాత్ముడు, పుస్తకం ఆత్మ అయితే- ఈ ఆత్మలు పరమాత్మలో తనం కావడానికి, పరమాత్మను చేరుకోవడానికి తహతహలాడాయి అని అనాలి. తమ పరమాత్మను తామే వెతుక్కుని పుస్తకాత్మలు సేదదీరాయి. తమ వియోగానికిక తెర పడిందని, తమ ప్రియులకు తృప్తిని, తమకు మోక్షాన్ని సిద్ధింపజేస్తామని ప్రకటిస్తూ వెళ్లిపోయాయి.
పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్లకూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు. ఎన్నో పుస్తకాలను పాఠక దేవుళ్లు కొన్నారని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. ప్రజలు కార్లు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని ఈ బుక్ ఫెయిర్ ఖరాఖండిగా చెప్పింది. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావు రాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముమ్మారు నినదించింది. పిల్లలు రంగురంగుల బొమ్మల పుస్తకాల వైపు, కథల వైపు, సి.డి.లవైపు లేత పూలలాగా ప్రవహించారు.
యువకులు వ్యక్తిత్వ నిర్మాణాలవైపు, ఉపాధి అవకాశాలను తెలిపే సమాచారమిచ్చే పుస్తకాలవైపు నడిచారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి లలితా సహస్రనామాల దగ్గర ఆగారు. అక్కడక్కడా గురువుల దగ్గర, గురు చరిత్రల దగ్గర నిలిచిపోయారు. పరిశోధకులు తమ తమ పరిశోధన అంశాలకు సంబంధించిన విషయ సేకరణ చేసుకున్నారు. పెద్దలు ఆధ్యాత్మిక, భక్తి గ్రంథాలను దేవులాడుకున్నారు. వృద్ధులు జీవితానుభవసారాన్ని వ్యాఖ్యానించే పుస్తకాలవైపు మొగ్గుచూపారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ డబ్బుల్ని తడిమి చూసుకుని, చూపు ఆనిన మేరకు ఒకటీ అరా పుస్తకాలను కొనుగోలు చేశారు. అధ్యాపకవర్గం ధరల విషయంలో చిరాకుపడింది. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొన్నారు. అసిస్టెంట్- అసోసియేట్ ప్రొఫెసర్లు డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వమని అడిగిచూశారు. కొనదలచిన పుస్తకాల్లో ఒకటీ అరా తగ్గించుకున్నారు.
ఐ.టి.ప్రొఫెషనల్స్ ఈసారి కొద్దిగా సంస్కృతి, సామాజిక పరిణామం, జీవిత చరిత్రలవైపు తొంగి చూసినట్లున్నారు. సాహిత్యాభిమానం గల పాత్రికేయులు ఆయా కవుల, రచయితల పుస్తకాలు కొనుగోలు చేశారు. అనువాదం, అనువాద సిద్ధాంతాలపై గ్రంథాలు స్వల్పంగా అమ్ముడయ్యాయి. భాష, సంస్కృతి, గిరిజనులపై మోనోగ్రాఫ్‌ల్లాంటివి కూడా కొన్ని అమ్ముడయ్యాయి. అరవింద అడిగ వైట్ టైగర్ పుస్తకం గురించి వాకబు ఎక్కువ జరిగింది. ఒబామా ప్రత్యేక ఆకర్షణ. హ్యారీ పోటర్ పిల్లల సంబరం. రజనీష్‌పై ఆసక్తి అదేవిధంగా కొనసాగుతోంది.
జిడ్డు కృష్ణమూర్తిపై కుతూహలం, సంశయం, పాఠకుల్లో.. ఇస్కాన్ ఎక్కడ? కొత్త పాఠకులు ఏర్పడుతూ ఉన్నారనడానికి సూచన. నాట్యం, చిత్రకళ, శిల్పం, సంగీతం పరిమిత సంఖ్యలో అమ్మకాలు. ఎడ్యుకేషన్‌పై గ్రంధాలు, సామాజిక శాస్త్ర గ్రంధాలు హాట్ కేకులు కాకపోయినా ఒక మాదిరిగా కదిలాయి. పెద్దబాలశిక్ష సూపర్ డూపర్ హిట్. వ్యసన సంస్కృతిని వదిలిపెట్టి అభ్యసన సంస్కృతివైపు వెళ్తున్నాం అనడానికిది నమ్మదగిన సూచన కాకపోవచ్చు. నేర్చుకోవటంలోని వెలితికి, నేర్చుకున్నది మరచిపోతున్న తక్షణ సంస్కృతికి కూడా గురుతు కావచ్చు. ఆర్.కె గారన్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ తన కాస్మాపాలిటన్ కల్చర్‌ని విశిష్టంగానే పట్టిచూపింది. మంచి పుస్తకాన్ని ఎంచి మరీ కొంటున్నారు. పాఠకులున్నారు
జాగ్రత్త. పబ్లిషర్స్ ఎంచి మరీ మంచి పుస్తకాలే వేయాలేమో! పదిరోజుల పుస్తక ప్రదర్శన పది కాలాలపాటు పాఠకులకు ఎటువంటి పుస్తకాలు, ఏ యే ధరల్లో వేయాలో విడమరచి చెప్పింది. ద్రావిడ విశ్వవిద్యాలయానికి స్టాల్ నెం 13కు చేకూరిన లాభమిదే. ఈ ఎగ్జిబిషన్‌లు ఆంధ్రదేశంలోని కవులు, రచయితలు చాలామంది కలిశారు. మా ద్రావిడ విశ్వవిద్యాలయం స్టాల్‌ను దర్శించారు. కొన్ని పుస్తకాలు కూడా కొన్నారు. నేను మాత్రం వచ్చే సందర్శకులలో స్మైల్‌ను, జ్వాలాముఖిని వెతుక్కుంటున్నాను. ఈ ఇద్దరే కనిపించడం లేదు…!
- సీతారాం

No comments yet
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు