By: గొరుసు
కడప జిల్లాకు ఈశాన్యదిశలోని ఓ మారుమూల (బాలరాజు) పల్లెలో వృత్తిరీత్యా బడిపంతులుగా జీవిక సాగిస్తూ కథాసేద్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించిన రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. మూడు జిల్లాల పొలిమేరలు కలిసే ఆటవిక ప్రాంతంలో ఉంటూ, సమీపంలో పేరున్న ఏ నగరమూ లేకపోయినా కూడా తన కథలకు రాజకీయంగా, సామాజికంగా, దేశ సమకాలీన సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎన్నుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది.
పుష్కర కాలంగా ఆయన రాస్తున్న కథలను పరిశీలిస్తే సంక్షోభంలో పడిన సేద్యాన్ని, పల్లెల్లో మారుతున్న సామాజిక పరిస్థితులను ఒక క్రమపద్ధతిలో మనం వీక్షించవచ్చు. ముందుమాటలో కేతు విశ్వనాథరెడ్డి అన్నట్టు సన్నపురెడ్డికి అక్కడి నేల రంగు, రుచి బాగా తెలుసు. తన ప్రాంతపు కొండలూ కోనలూ, మెరకలూ బరకలూ, వాగులూ వంకలూ, గడ్డీ గాదం, పైర్లూ పచ్చలూ, కక్షలూ కార్పణ్యాలు, మంచీ చెడూ, తిండీ తిప్పలూ, కులాలూ గిలాలూ, బంధాలు అనుబంధాలూ, ఆటలూ పాటలూ, కులాసాలూ గిలాసాలూ చివరకు భాషా యాసా అన్నిటినీ తన కథా రూపాలకు అనుకూలంగా మలచుకున్న నేర్పరి. తనకు తెలిసిన జీవితాన్ని నిర్భయంగా అక్షరబద్ధం చేయగలడు. ఆయన ప్రతి కథా గ్రామీణ జీవన నేపథ్యాన్నించి వచ్చిందే. ఏ పాత్రా నేలవిడిచి సాము చేయదు. అదీకాక బంగారానికి తావి అబ్బినట్టు ఆయనది పదునైన శైలి. అందమైన వాక్య నిర్మాణం. రసాత్మక దృష్టి.
సేద్యంతో చితికిపోయిన తమ్ముళ్లతో, పిల్లల రాక కోసం పరితపించే లక్ష్మమ్మలతో, ప్రేమకోసం సర్వం ధారపోసే రంగమ్మలతో, దుర్గల్లాంటి వీరనారులతో … ఇలా ప్రతీ పాత్రతోనూ రచయితకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని ఈ కథలు పట్టిస్తాయి.
కథాసేద్యంతో పాటు ఒక్కోసారి జమిలిగా నవలా సేద్యాన్ని కూడా చేస్తుంటాడీయన. ఆ మధ్య పండించిన ‘చినుకుల సవ్వడి’ నవలని విమర్శకులు ఒక రసరమ్య కావ్యంగా అభివర్ణించారు. అడపాదడపా తన సాహితీ క్షేత్రంలో కవిత్వాన్ని కూడా నాటుతుంటాడు.
సన్నపురెడ్డి కథలది పెద్ద కాన్వాస్. అందులో ఆయన చిత్రించిన ప్రతి బొమ్మా అందమైనది, ఆత్మావలోకనం కలగజేసేది. వాటిని పరిచయం చేయటానికి, విశ్లేషించడానికి ఏవో నాలుగు పొడక్షరాలు ఇలా కెలికితే సరిపోదు. ఒక దశాబ్ది రాయలసీమ చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోగోరేవారు చదవాల్సిన కథా సంపుటి అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పడం కోసమే ఈ రెండు ముక్కలూ! ఇతణ్ణి ‘తెలుగు కథకున్న భవిష్యత్ ఆశల్లో నిస్సందేహంగా ఒకడు’గా గుర్తించిన విమర్శకుడు వల్లంపాటి మాటల్ని వమ్ము చేయని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డికి అభినందనలు.
కొత్త దుప్పటి (కథా సంపుటి)
రచన: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
పేజీలు: 252,
వెల : రూ.120,
ప్రతులకు: విశాలంధ్ర అన్ని బ్రాంచీలు
From: Andhrajyothy (19-10-08)
ఇటీవలి అభిప్రాయములు